మీ స్వేచ్ఛను మీరు పోగొట్టుకోవాలనుకున్నప్పుడే అది మీ నుంచి పోతుంది. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకుని ఎవరిపైనో ఆధారపడాలనుకుంటారు. ఆ భావనే మీ స్వేచ్ఛను హరిస్తుంది. కాబట్టి, మీరు బాధ్యతను పూర్తిగా స్వీకరించినప్పుడు మాత్రమే మీకు స్వేచ్ఛ లభిస్తుంది.
మనిషి స్వేచ్ఛకు దేవుడు పెద్ద అడ్డంకి. అందుకే దేవుడున్నంతవరకు మనిషి బానిసగా ఉంటాడే తప్ప, వాడికి పూర్తి స్వేచ్ఛ లభించదు. కాబట్టి, మనిషికి పూర్తి స్వేచ్ఛ లభించాలంటే దేవుడి మరణం తప్ప మరొక మార్గం లేదు. దేవుడు లేనప్పుడే “స్వేచ్ఛ” అనే పదానికి అసలైన అర్థం తెలుస్తుంది.
మనిషికి పూర్తి స్వేచ్ఛ దక్కాలంటే కేవలం దేవుడు మరణించినంత మాత్రాన సరిపోదు. దేవుడిని ఆలంబనగా చేసుకుని మనుగడ సాగిస్తున్న మతాలన్నీ అంతరించాలి. అంతేకాదు, దేవుడు లేని, మతం లేని, మనకంటే సర్వశక్తిమంతుడైనవాడు “పైన” ఎవడూ లేని నూతన ధార్మికతతో కూడిన సమాజం ఏర్పడాలి. అప్పుడే మనిషికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లు.
జంతువుల్లా విచ్చలవిడిగా జీవించడం “స్వేచ్ఛ” కాదు. ఎందుకంటే, అలాంటి స్వేచ్ఛకు బాధ్యతాయుతమైన చైతన్యముండదు. కానీ, స్వేచ్ఛను అందరూ అలాగే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, అనేక రకాల బానిసత్వాలలో మగ్గుతున్న నియంత్రించబడిన మనసు స్వేచ్ఛ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. కానీ, బాధ్యతారహితమైన అలాంటి స్వేచ్ఛ వల్ల మీరు ఏమాత్రం ఎదగకపోగా మరింత పతనమవుతారు.
మీరు దేవుడిపైకి ఏది నెట్టినా, ఎన్ని నెట్టినా కాదనడు. ఎందుకంటే, వాడు లేడు. లేని వాడు ఎలా కాదనగలడు? అందుకే దేవుడు ఎప్పుడూ ఏదీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. కాబట్టి, దేవుడు, విధి, అదృష్టాలు ఏమాత్రం అర్థం లేని నకిలీ పదాలు. వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. అప్పుడే మీకు పూర్తి బాధ్యత, స్వేచ్ఛల గురించి చాలా స్పష్టంగా తెలుస్తుంది.
అనేక వేల సంవత్సరాలుగా మీ చర్చిలు, సినగాగులు, దేవాలయాలు, మసీదులు మిమ్మల్ని బానిసలుగానే తయారుచేశాయి. వాటి బారి నుంచి, అలాగే మృత నిరంకుశుల ఆధిపత్యాల నుంచి మీరు బయటపడాలి. అంతవరకు మీకు స్వేచ్ఛ లేనట్లే. నిన్న, రేపు లేని, ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఎలాంటి భయాలు లేకుండా ఉండేదే అసలైన స్వేచ్ఛ.
స్వేచ్ఛ పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది. ప్రతి కదలిక ప్రమాదకరమే. అనుక్షణం మనకు తెలియని ప్రమాదాలతో సవాలు చేసే పోరాటమే స్వేచ్ఛ. దానికి రక్షణ, భద్రత, బీమా సౌకర్యాలుండవు. అది మీకు మీరుగా తీసుకునే మహత్తరమైన బాధ్యత.
అందరూ స్వేచ్ఛను కోరుకునేవారే. కానీ, అదంటే అందరికీ భయమే. ఎందుకంటే, స్వేచ్ఛతో పాటు పూర్తి బాధ్యత కూడా వస్తుంది. కానీ, బాధ్యతను స్వీకరించేందుకు ఎవరూ సిద్ధపడరు. అందరూ లోలోపల కోరుకునేది బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనాలే. కానీ, బాధ్యత వద్దనుకుంటే బానిసత్వం తప్పదు. కాబట్టి, పూర్తి బాధ్యతను స్వీకరించండి. అప్పుడు స్వేచ్ఛ దానంతటదే మీకు లభిస్తుంది.
స్వేచ్ఛను ఇచ్చేదే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమనే ప్రామాణికంగా చేసుకుని ప్రేమించండి. అంతేకానీ, పెళ్ళి అనబడే నకిలీ బాంధవ్యం కోసం మీ ప్రేమను నాశనం చెయ్యకండి. మీ ప్రేమపై మీకు నమ్మకముంటే, మీరెందుకు పెళ్ళి చేసుకోవాలి? ఆ ఆలోచన రావడమే అపనమ్మకానికి సూచన. అలాంటి పెళ్ళి ఒకరకమైన వ్యభిచారం లాంటిదే. అలాంటి బంధం ఉన్నతంగా ఎదగకపోగా మీ ప్రేమను సర్వనాశనం చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది జనాలు కులానికో, మతానికో, వర్ణానికో, తెగకో, దేశానికో, సంప్రదాయానికో బందీలుగా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే, ఎలాంటి బాధ్యత స్వీకరించకుండానే వారికి కావలసినవన్నీ ఇతరుల ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అందుకే వారు జీవితాంతం ఆ జైళ్ళను భరిస్తూనే ఉంటారు.
బానిసత్వం నుంచి మీరు బయటపడగలిగితే కచ్చితంగా మీరు సృజనాత్మకులవుతారు. మీ సంకెళ్ళను మీరు తెంచుకోగలిగితే, మీ జైళ్ళను మీరు ధ్వంసం చెయ్యగలిగితే కచ్చితంగా మీరు ఎంతో కొంత సౌందర్యాన్ని సృష్టించగలుగుతారు. కేవలం ఆనందించేవారు మాత్రమే సృజనాత్మకులవుతారు.
అనేక వేల సంవత్సరాలుగా దేవుడి పేరు మీద మీరు అనేక రకాల సంకెళ్ళతో బంధించబడ్డారు. అందుకే వాటిని మీరు దేవుడిచ్చిన ఆభరణాలుగా భావిస్తున్నారు. డబ్బు, పరువు, ప్రతిష్టల్లాంటివన్నీ ఎవరికి వారు వేసుకున్న బంగారు సంకెళ్ళే. కాస్త గమనిస్తే, మానవజాతి గతమంతా మరింత మెరుగైన సంకెళ్ళ తయారీకే అంకితమైనట్లనిపిస్తుంది.
మీకు తెలియని భాషలో ప్రార్థించడం సులభమైన పద్ధతి. ఎందుకంటే, అలాంటి ప్రార్థన మిమ్మల్ని ఎప్పుడూ మైమరపిస్తుంది. కాబట్టి, మీకు తెలిసిన భాషలో ఎప్పుడూ ప్రార్థించకండి. ఎందుకంటే, తెలిసిన భాషలో చేసే ప్రార్థనలో పస ఉండదు.
“రేపు” అనేది మీకు అనేక వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. కానీ, అది కేవలం ఒక ఓదార్పు మాత్రమే. స్వేచ్ఛకు బదులు అది మీకు మరణాన్ని తీసుకొస్తుంది. అందువల్ల మీరు బతికున్నన్ని రోజులు బానిసగానే జీవిస్తారు. ఎందుకంటే, వర్తమానం వృథా అవుతోందని మీరు ఎప్పుడూ బాధపడరు.
గతం మీ జ్ఞాపకం. భవిష్యత్తు మీ ఊహ. వాటికి ఉనికి లేదు. కేవలం వర్తమానం మాత్రమే మీ ముందున్న వాస్తవం. అలాంటి వర్తమానంలో మీరు పూర్తిగా అప్రమత్తతతో ఉంటూ, మీ చైతన్యాన్ని గతం, భవిష్యత్తుల నుంచి సేకరించి ఆ వర్తమానంలో కేంద్రీకరించడమే “స్వేచ్ఛ రుచి” తెలుసుకోవడమంటే.
ఒక్క మనిషికి తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా బానిసత్వం లేదు. కాబట్టి, అందులోంచి బయటపడడం ఏమంత కష్టం కాదు. నిజానికి, బానిసత్వం మిమ్మల్ని పట్టుకోలేదు. మీరే దానిని పట్టుకున్నారు. మీ బంధనాలే అందుకు కారణం. అందుకే అవి మీతో ఉన్నాయి.
ఎందుకూ పనికిరాకుండా, తాను గర్వించగల ఎలాంటి సామర్థ్యం లేకుండా, ఈ అస్తిత్వాన్ని మరింత సుసంపన్నం చేయగల నూతన అందాలను సృష్టించే కనీస సామర్థ్యమైనా లేకుండా ఎవరూ ఈ ప్రపంచంలోకి రారు.
మీ వ్యక్తిత్వాన్ని బానిసగా చెయ్యగలము కానీ, మీ ఆత్మను బానిసగా చెయ్యలేము. ఎందుకంటే, మీ వ్యక్తిత్వాన్ని అమ్మగలం కానీ, ఆత్మను అమ్మలేము. కాబట్టి, ఆధ్యాత్మిక పరమైన స్వేచ్ఛను ఎవరూ ఏమీ చెయ్యలేరు.
“మోక్షం” అంటే మరణించే వాటన్నింటి నుంచి, అవాస్తవాలన్నింటి నుంచి, మిమ్మల్ని బంధించే వాటన్నింటి నుంచి “పరిపూర్ణమైన స్వేచ్ఛ” అని అర్థం. అలాంటి స్వేచ్ఛ మీకు లభించిన వెంటనే “అమర ద్వారాలు” మీకోసం తెరుచుకుంటాయి.
హిందూ, యూదు, జైన, మహమ్మదీయ, క్రైస్తవ – ఇలా మీరు మీ మత తత్వాల నుంచి, గడచిన గతం నుంచి, తెలియని భవిష్యత్తు నుంచి పూర్తిగా బయటపడనంతవరకు మీకు స్వేచ్ఛ లేనట్లే. నిన్న, రేపు లేని, ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఉండేదే అసలైన స్వేచ్ఛ.