నవీన మానవుని ఆవిర్భావం కోసం కలలు కంటూ, నూతన మానవాళితో నిండిన నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి క్షణం పరితపించిన ఇరవైయ్యవ శతాబ్దపు బుద్ధుడైన ఓషో అందించిన నవజీవన మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, ఓషో ప్రేమికులకు, అభిమానులకు సులభంగా అర్థమయ్యే చక్కని తెలుగు భాషలో పుస్తకాలు, ప్రవచనాలు, సూక్తులు, ధ్యానపద్ధతులు, చర్చా వేదికలు అనే మాధ్యమాలను అంతర్జాలం ద్వారా అందించేందుకు ఓషో అభిమానినైన భరత్ అనబడే నేను చేస్తున్న ప్రయత్నమే ధ్యానం – వేడుక – జీవించే కళ అనే ఉపశీర్షికతో మీ ముందుకు వచ్చిన ఓషో వండర్స్.కామ్. ఇది కేవలం ప్రారంభమే అయినప్పటికీ, మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు కాలానుగుణంగా రూపుదిద్దుకునే మరింత మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన మార్పులు, చేర్పులు పైన పేర్కొన్న అన్ని మాధ్యమాలలో పొందుపరిచే ప్రయత్నం ఓషో వండర్స్.కామ్ నిరంతరం చేస్తూనే ఉంటుంది.
ఈ ప్రయత్నంలో ఓషో అభిమానినైన నేను ఆంగ్ల భాషలో ఉన్న ఓషో ప్రసంగాలను ఒకటిన్నర దశాబ్దకాలంగా అందరికి చాలా సులభంగా అర్థమయ్యే తెలుగు భాషలోకి అనువదించి ఓషో నవజీవన మార్గదర్శకాలు శీర్షికన పుస్తకాలుగా తీసుకొచ్చాను. వాటిని పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పత్రీజీ పవిత్ర హస్తాలు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాచక్రం ఉత్సవ కార్యక్రమాలలో విడుదల చేసి నన్ను ఆశీర్వదించాయి. ఆ మహాత్ముని ఆశీర్వాదం నా పుస్తకాలు తెలుగు హృదయాలకు చేరేలా చేస్తే, అనువాద రహస్యాలు నేర్పి నా పుస్తకాలకు తన విలువైన సలహాలను అందించిన, అందిస్తున్న నా మిత్రుడు చిలుకూరి వెంకట సుబ్బారావు గారి సహకారం, మీడియా మిత్రుల ప్రోత్సాహాలు నా కృషికి మీ అందరి ఆదరణ దక్కేలా చేశాయి. అలా బ్రహ్మర్షి పత్రీజీ ఆశీర్వాదం నాకు బలమై, వరమై, మీ హృదయాల పులకింత నాకు ప్రోత్సాహమై అంతర్జాలంలో ఓషో వండర్స్.కామ్ వేదిక రూపకల్పనకు ప్రాణం పోసింది. అందులో ఉన్న పుస్తకాల విభాగంలో నేను అనువదించిన పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి. అలాగే ఓషో వండర్స్.కామ్‌లో శాశ్వత సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఇప్పటి వరకు నేను అనువదించిన 13 పుస్తకాలతో పాటు, భవిష్యత్తులో నేను అనువదించే పుస్తకాలన్నీ చదువుకునేందుకు పి.డి.ఎఫ్. రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యం కేవలం ఓషో వండర్స్.కామ్‌లో శాశ్వత సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కాబట్టి, ఓషో అందించిన ఆ నవజీవన మార్గదర్శకాలను అందరూ చక్కగా అవగాహన చేసుకుని జీవితానికి అన్వయించుకుంటూ, జీవించే కళ తెలుసుకుని జీవితాన్ని వేడుక చేసుకుంటూ బుద్ధత్వాన్ని సాధించే మార్గంలో పయనించండి. అదే నవ సమాజ నిర్మాణానికి జీవం పోసి ఓషో కలను నిజం చేస్తుంది. ఓషోకు మనం అందించే హృదయపూర్వక నివేదన అదే. ఆ నివేదన కోసం, అలాగే మీ కోసం నేను చేసిన ప్రసాదమే ఓషో వండర్స్.కామ్. దానిని పూర్తిగా ఆస్వాదించి మీ అనుభూతిని నాకు తెలపండి. అదే మీరు నాకిచ్చే ఆశీర్వాదం.
… ఓషో భరత్