మీ క్రియాశీలతకు నూతనత్వాన్ని జోడించడమే “సృష్టించే కళ”. అది మీ అంతరంగ వైఖరిపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రేమిస్తూ, ఆనందిస్తూ, ఒక వేడుకగా చేసే ఏ పని అయినా ఆర్థికపరంగా అపవిత్రం కానప్పుడు అదే సృజనాత్మకత అవుతుంది. ఎందుకంటే, ప్రేమ స్పర్శతో చిన్న చిన్న విషయాలన్నీ చాలా గొప్పవిగా మారిపోతాయి.
“An empty mind is a devils workshop” అనే సామెతను సృష్టించినటువంటి మూర్ఖ శిఖామణులు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. అది నిజం కాదు. వాస్తవానికి, “An empty mind is a Gods workshop”.
క్రియ ప్రతి క్షణం సమయస్ఫూర్తితో స్పందిస్తుంది. క్రియాశీలత ఎప్పడూ గతంతో నిండి ఉంటుంది. అందుకే అది వర్తమానంలో స్పందించదు. క్రియ సృజనాత్మకమైనది. క్రియాశీలత అత్యంత నాశనకారి. అందుకే అది మీతోపాటు ఇతరులను కూడా నాశనం చేస్తుంది.
క్రియాశీలత లక్ష్యాధారమైనది. కానీ, క్రియ అలాంటిది కాదు. పూర్వాభ్యాసంతో ముందుగా సిద్ధం కాకుండా వర్తమాన క్షణంలో పొంగి పొరలే శక్తి ప్రవాహమే క్రియ. మొత్తం అస్తిత్వమంతా మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు అప్రయత్నంగా మీ నుంచి వచ్చే స్పందనే క్రియ.
మనిషి లోపల దేవుడు దాగి ఉన్నాడు. వాడు మీ నుంచి బయటపడేందుకు అతడికి ఒక చిన్న దారి చూపడమే సృజనాత్మకత. దివ్యసంభవాన్ని అనుమతించడమే సృజనాత్మకత. అది ఒక ధార్మిక స్థితి. “సృష్టించే కళ” అంటే అదే.
మీ అహమే మీ మరణం. దాని మరణమే మీ అసలైన జీవిత ప్రారంభం. అదే సృజనాత్మకత. కాబట్టి, మీ అహం అంతరించేందుకు మీరు మీలోకి ప్రయాణిస్తూ దానికి సహకరించడమే మీరు చెయ్యవలసిన పని. అహం అంతర్థానమైనప్పుడు అందమైన సత్యం మాత్రమే మిగులుతుంది. అప్పుడు జరిగేదంతా అద్భుతంగా ఉంటుంది.
సహజంగా చేసే పని ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. చాలా గొప్పగా చెయ్యాలనే తపనతో చేసే అసహజమైన ప్రయత్నాలు ఎప్పుడూ అసంపూర్ణ ఫలితాలనే ఇస్తాయి. సహజత్వమే సంపూర్ణత్వం.
మీకు మీరు గుర్తున్నప్పుడు ఆ దేవుణ్ణి మీరు మరచిపోతారు. మిమ్మల్ని మీరు మరచినప్పుడు ఆ దేవుడు మీకు గుర్తొస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే సాధ్యపడుతుంది. రెండింటినీ గుర్తుంచుకోవడం అసాధ్యం.
అహం ఎప్పుడూ ఎదురీదేందుకే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే, కష్టమైన పనులు సాధించడం మీ అహానికి ఒక సవాలవుతుంది. అలా మీ అహం పదునెక్కుతుంది. కాబట్టి, అహం ఒక మానసిక దౌర్బల్యం. దానితో పరిపూర్ణత్వం సాధించడం అసంభవం. అహం లేనప్పుడు పరిపూర్ణత్వం దానంతటదే సహజంగా సిద్ధిస్తుంది.
భగవంతుని సృష్టిలో ప్రతీదీ అసంపూర్ణంగానే ఉంటుంది తప్ప, సంపూర్ణమైనది ఏదీ లేదు. ఎందుకంటే, అసంపూర్ణంలోనే అందముంటుంది, కొనసాగే జీవముంటుంది. అందుకే భగవంతుని సృష్టి ఇంకా కొనసాగుతోంది. ఏదైతే సంపూర్ణత్వాన్ని పొందుతుందో అది మరణించినట్లే. ఎందుకంటే, అక్కడ కొనసాగేందుకు ఏదీ ఉండదు.
అస్తిత్వ సర్వస్వం మీ ద్వారా ఏదో ప్రత్యేకమైన, ప్రయోజనకరమైన పనిని చాలా అర్థవంతంగా చెయ్యాలనుకుంది. అందుకే మీరు, మీలాగే అందరూ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అంతేకానీ, ఎవరూ అనవసరంగా, యాదృచ్ఛికంగా ఇక్కడకు రాలేదు.
సృజనాత్మకుడు ఎక్కడా స్థిరపడలేడు. ఎందుకంటే, అది వాడికి మరణంతో సమానం. అందుకే వాడు దేశదిమ్మరిగా తిరుగుతూ ఎప్పుడూ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే, అది వాడి ప్రేమ వ్యవహారం.
నిజానికి, అజ్ఞానమే వెలుగు. ఆ స్థితిలో ఉండడమనేది అస్తిత్వంలోని అందమైన అనుభూతులలో ఒకటి. ఎందుకంటే, ఆ స్థితిలో ఉన్న మీరు అన్వేషించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అడుగు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉంటారు.
సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే అజ్ఞానంతో అన్వేషించండి. జ్ఞానంతో అన్వేషించేవారు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే, వారి జ్ఞానమే వారికి ప్రతిబంధకమవుతుంది.
అహం ఉచ్చులో పడకండి, అది చెప్పినట్లు వినకండి. అప్పుడే అపవిత్రమైనవి కూడా పవిత్రమవుతాయి. నిజానికి, ఏదీ అపవిత్రమైనది కాదు. ప్రతీది పరమ పవిత్రమైనదే. అలా ప్రతీది మీకు పరమ పవిత్రమైనదిగా అయ్యేవరకు మీ జీవితం ధార్మికతను సంతరించుకోదు.
జీవితం చాలా చిన్న చిన్న విషయాలతో కూడుకున్నది. కానీ, మీ అహం వాటిని వద్దంటూ, పెద్ద పెద్ద ఘనకార్యాలు చెయ్యమంటుంది. అలా మీ అహం మీకు సమస్యను సృష్టిస్తుంది. కాబట్టి, మీరు మీ అహాన్ని వెంటనే విడిచిపెట్టి, చిన్న చిన్న విషయాలను కూడా ప్రేమించడం ప్రారంభించండి. అప్పుడు ఆ చిన్న విషయాలే ఘనకార్యాలవుతాయి.
చేసే పనిని గాఢమైన ప్రేమతో, ధ్యానపూర్వకంగా ఆనందిస్తూ చెయ్యడమే సృజనాత్మకత. లేకపోతే, అది తప్పించుకోలేని బరువైన బాధ్యతగా మారుతుంది. మీరు చేసే పనిలో మీరెంత నిమగ్నమయ్యారనేదే ముఖ్యం. అప్పుడే మీరు సృష్టించిన దానిలో దివ్యత్వముంటుంది.
మానసిక జ్ఞాపకాలు మీకు చాలా బరువుగా తయారవుతూ ఉంటాయి. అవి మిమ్మల్ని పంజరంలో బంధించి మీ స్వేచ్ఛను, జీవకళను హరిస్తాయి. ఎందుకంటే, మానసిక జ్ఞాపకం ఒక అంతరాయం. వాస్తవ జ్ఞాపకాలు పరవాలేదు. అవి కచ్చితత్వంతో ఉంటాయి.
మీకు ఎంత ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటే మీరు అంత తక్కువ సృజనాత్మకంగా ఉంటారు. ఎందుకంటే, మీరు అవే జ్ఞాపకాలను పునరావృతం చేస్తారు. సృజనాత్మకత అంటే నూతనమైన దానిని ఆవిష్కరించడం. అలా చెయ్యడమంటే జ్ఞాపకాన్ని పక్కన పెట్టినట్లే.