లైంగిక శక్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి. దేవుడు కూడా దేన్నైనా సృష్టించాలంటే Sex ను ఆశ్రయించవలసిందే. ఎందుకంటే, ఏ జీవమైనా Sex నుంచే పుడుతుంది. ఈ విశ్వమంతా Sex అనే పదార్థంతోనే నిర్మించడం జరిగింది. కాబట్టి, మీరు ఎప్పుడూ Sex ను వ్యతిరేకించకుండా, దానిని ఆస్వాదించడం ప్రారంభించండి.

Sex ను Sex ద్వారా అతి సులభంగా అధిగమించవచ్చు. Sex కు దగ్గరగా ఉండడమంటే దివ్యచైతన్యానికి దగ్గరగా ఉన్నట్లే. మీ ఆధ్యాత్మిక జీవితంలో Sex ఒక పవిత్రమైన భాగమవాలి కానీ, అది మీకు ఏదో అడ్డకింగా, నిషేధించబడినదిగా, అణచివేయబడినదిగా ఉండకూడదు. దానిని మీరు చాలా గౌరవించాలి. ఎందుకంటే, మనం అందులోంచే జన్మించాం. అదే మన జీవశక్తి.

సెక్సే ప్రారంభం, సెక్సే ముగింపు. మీకు ముందుగా తెలిసేది అదే, చివరికి మీరు తెలుసుకునేదీ అదే. ఎందుకంటే, అదే మీకు పునాది. దానితోనే జీవితం ప్రారంభమవుతుంది, దానితోనే జీవితం ముగుస్తుంది. కాబట్టి, మీరు ప్రార్థనాపూర్వకమైన ప్రేమానుభూతిలో ఉన్నప్పుడు మాత్రమే సెక్స్ లో పాల్గొనండి. అప్పుడే మీరు “దివ్య చైతన్యానుభూతి” పొందగలరు.

“ప్రేమ” అనే పదాన్ని అత్యంత మోసపూరితంగా వాడినంతగా మనిషి మరే పదాన్నీ వాడలేదని ఏమాత్రం గమనించినా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా దురదృష్టకరమైన విషయమేంటంటే, ఎవరైతే ప్రేమను అసత్యంగా మార్చేశారో, ఎవరైతే ప్రేమ ప్రవాహాలకు అడ్డుగా నిలిచారో, వారినే మనం ప్రేమకు మూలపురుషులని భావిస్తున్నాం.

లైంగిక శక్తి ప్రేమ శక్తిగా రూపాంతరం చెందుతుంది. కానీ, మీ మహానుభావులందరితో పాటు, ప్రతి ఒక్కరూ దానికి వ్యతిరేకులే, శత్రువులే. అందుకే ప్రేమ బీజం అంకురించలేదు. ఈ వ్యతిరేక భావమే ప్రేమ సౌధం పునాదులను ఆదిలోనే అంతం చేసింది.

కాముకత్వం రూపాంతరం చెందినప్పుడు భార్య తల్లిగా మారుతుంది. లాలసత్వం రూపాంతరం చెందినప్పుడు Sex ప్రేమగా పరిణమిస్తుంది. కాబట్టి, కేవలం ఒక్క లైంగిక శక్తి మాత్రమే ప్రేమ శక్తిగా వికసిస్తుంది. అయితే, అది కేవలం Sex ను పవిత్రంగా అంగీకరించడం ద్వారా మాత్రమే సంభవిస్తుంది.

“ఏదో, పొరబాటున నోరు జారేను” అని ఎవరైనా అన్నప్పుడు, వారి మాటలు ఎప్పుడూ నమ్మకండి. నిజానికి, నోరు జారడమనేది ఎప్పుడూ జరగదు. ఎందుకంటే, మనం మాట్లాడే మాటలన్నీ, మనం మాట్లాడేందుకు ముందుగానే మనలో రూపుదిద్దుకుంటాయి.

ఏకత్వభావన అనుభవంలోకి రావడమే ప్రేమంటే. అడ్డుగోడలు కూలిపోయి, రెండు శక్తులు ఏకమైన అనుభవమే ప్రేమంటే. అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభవిస్తే ప్రేమ అవుతుంది. అదే అనుభవం ఒక వ్యక్తికి, ఈ విశ్వానికి మధ్య సంభవిస్తే, అది దివ్యానుభూతి అవుతుంది.

పెద్దవి ఎప్పుడూ అంతే. అవి చిన్న వాటిపై ఇట్టే ప్రేమలో పడతాయి. కానీ, ఎప్పుడో తెలుసా? “తాము పెద్దవి అనే భావన” వాటికి లేనప్పుడు. ప్రేమ ఎప్పుడూ అంతే. తల వంచేందుకు అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

తల వంచేందుకు అహం ఎప్పుడూ సిద్ధంగా ఉండదు. అదెప్పుడూ తల పైకెత్తి నిటారుగా బిగుసుకుపోయి ఉంటుంది. అందువల్ల దానిని మీరు ఎప్పుడూ తాకలేరు. ఎవరికీ అందనంత ఎత్తులో సింహాసనంపై కూర్చునేవారే అహం దృష్టిలో గొప్పవారు. అంతేకానీ, తనని తాకే వారందరిపైనా అహానికి ఎప్పుడూ చిన్నచూపే.

అహం ఎప్పుడూ తనకన్నా పెద్దగా ఉండే వాటిని, తనకన్నా ఉన్నతమైన వాటినే ప్రేమిస్తుంది. అదెప్పుడూ అలాంటి వాటితోనే పోల్చుకుంటుంది. కానీ, నిజమైన ప్రేమకు పెద్ద, చిన్న అనే తారతమ్యముండదు. అది ఎప్పుడూ తన దగ్గరకు వచ్చిన అన్నింటినీ ప్రేమతో కౌగిలించుకుంటుంది.

ప్రేమ ఎప్పుడూ అంతే. తనది ఏదైనా కాస్త ఇవ్వగలిగినప్పుడు, అది చాలా సంతోషపడుతుంది. కానీ, అహం అలా కాదు. తనది కాని దానిని బలవంతంగా లాగి గుంజుకోగలిగినప్పుడు మాత్రమే అహం చాలా సంతోషపడుతుంది.

ప్రేమ కిరీటాన్ని ధరించినవాడెప్పుడూ రాజులా ఉంటాడు. అహం ఎప్పుడూ ముళ్ళ కిరీటమే. దానిని ధరించినవాడెప్పుడూ దిగులుగా, దీనాతిదీనంగా, బిచ్చగాడిలా ఉంటాడు. కాస్త సౌకర్యాన్ని ఎవరికి ఇవ్వగలిగినా ప్రేమ సంతోషపడుతుంది. కానీ, అహం అలా కాదు. ఇతరులకు సుఖం లేకుండా చెయ్యడంలోనే అది ఎక్కువగా ఆనందిస్తుంది.

కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ చాలా విలువైనది. ఎందుకంటే, అది కావాలని పెంచుకున్నది. ప్రేమ ఎప్పుడూ అంతే. ప్రేమ అంటేనే అంతులేని నిరీక్షణ. తాను ప్రేమించినవారి కోసం ప్రేమ ఎంత కాలమైనా నిరీక్షిస్తూనే ఉంటుంది.

ప్రేమ ఎప్పుడూ అంతే. తన ప్రేమను పంచలేనప్పుడు, తన దగ్గర ఉన్నది ఇవ్వలేనప్పుడు అది చాలా బాధపడుతుంది. తన దగ్గర ఉన్నది పంచగలిగినప్పుడే దానికి పరమానందం, తన సర్వస్వాన్ని సమర్పించుకోగలిగినప్పుడే దానికి బ్రహ్మానందం.

అహం ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూనే ఉంటుంది. ఎందుకంటే, అహం ఎప్పుడూ ఏదో ఒక ఉద్దేశంతో ఉంటుంది. కానీ, ప్రేమకు ఎలాంటి ఉద్దేశాలు, ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే, ప్రేమ తనకు తానే ఒక బహుమతి.

ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమ తన సర్వస్వాన్ని సమర్పిస్తుంది. ఎందుకంటే, ప్రేమది ఎప్పుడూ దాచిపెట్టుకునే స్వభావం కాదు. కానీ, అహం అలా కాదు. తనది ఎవరికీ ఏమాత్రం ఇవ్వకపోగా, అందరి నుంచి అన్నీ గుంజుకుని దాచుకుంటుంది.

ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా, ప్రతిఫలంగా ఏదీ ఆశించకుండా ఇవ్వడం, ఇస్తూనే ఉండడమే ప్రేమంటే. తనకున్నదంతా పంచిపెట్టేందుకు ప్రేమ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ, అహం అలా కాదు. దానికి ఏదీ చాలదు. అందుకే అది ఇతరుల నుంచి ఎంత గుంజుకున్నా, ఇంకా ఏదో కావాలని అది ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది.

అహానిది ఎప్పుడూ అడుక్కుతినే వ్యవహారం. ప్రేమది ఎప్పుడూ ఊరికే లభించే విరాళం. అహానికి ఎప్పుడూ కేవలం “స్వీకరించే భాష” మాత్రమే అర్థమవుతుంది. ప్రేమ ఎప్పుడూ సమర్పించుకుంటుంది. ఎందుకంటే, దానికి కేవలం “సమర్పించే భాష” మాత్రమే తెలుసు.

సెక్స్ బొగ్గు లాంటిది. బ్రహ్మచర్యం వజ్రం లాంటిది. సెక్స్ రూపాంతర స్థితే బ్రహ్మచర్యం. వజ్రానికి బొగ్గుతో ఎలాంటి శత్రుత్వమూ లేదు. అది కేవలం బొగ్గు యొక్క రూపాంతర స్థితి. అలాగే బ్రహ్మచర్యం సెక్స్ కు వ్యతిరేకం కాదు. సెక్స్ రూపాంతరమే బ్రహ్మచర్యం. సెక్స్ కు శత్రువుగా ఉండేవారు బ్రహ్మచర్యాన్ని ఎప్పటికీ పొందలేరు.

సెక్స్ ను ఖండించాం, నిందించాం, పరమ ఛండాలమన్నాం, మహాపాపమంటూ దానిని వ్యతిరేకించాం, దూషించాం, అవమానించాం, నరకానికి అది మార్గమన్నాం. సెక్స్ ను బలవంతంగా అణిచే విషయంలో మనని మనం సమర్థించుకునేందుకు దానికి అలాంటి నీచమైన పేర్లు పెట్టాం. కానీ, అలా చెయ్యడం వల్లనే మన జీవితం విషతుల్యమయిందనే విషయం మనకు అర్థం కాలేదు.

ప్రేమించడం, ప్రేమను సమర్పించడం, ప్రేమలో జీవించడం అనేవి మన ప్రేమ పరిధి పెరిగేందుకు దోహదపడే అంశాలు. ప్రేమ దీక్ష ప్రారంభించేందుకు కేవలం మనుషులను మాత్రమే ప్రేమించవలసిన అవసరం లేదు. నిరంతరం ప్రేమలోనే ఉంటూ, అన్నింటినీ మనం ప్రేమిస్తూ ఉండడమే ప్రేమ దీక్ష పరమావధి.

ప్రేమ, ధ్యానాల సంగమమే దివ్యత్వం. కాబట్టి, ప్రేమ, ధ్యానం కలిస్తే దివ్యత్వానికి ద్వారం తెరుచుకుంటుంది. అదే దివ్యత్వ సాధన. దాని ఫలమే బ్రహ్మచర్యం. అప్పుడు మీలోని జీవశక్తి ఊర్థ్వముఖంగా పైపైకి వెళ్తూనే ఉంటుంది. మీలో నిక్షిప్తమై ఉన్న జీవశక్తి ఊర్థ్వముఖంగా ప్రయాణించడమే బ్రహ్మచర్యం.

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com