ఎవరైతే వాస్తవంగా ప్రేమించగలరో వారు ప్రేమలో ఉండగలరు. ఎవరైతే ప్రేమలో ఉండగలరో వారు ప్రేమను సాధించగలరు. ఎవరైతే ప్రేమను సాధించగలరో వారే ప్రేమ అవుతారు.
ప్రేమిస్తున్నప్పుడు మరణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, ప్రేమిస్తున్నప్పుడు మీలో ఉన్న అవాస్తవమైన అహం మరణిస్తుంది. మీ అహమే మీరు. అందుకే ప్రేమిస్తున్నప్పుడు మీరు మరణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి, అహం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు అహం ఉండదు. అవి రెండూ ఒకేచోట కలిసి ఉండడం అసంభవం.
అచేతన ప్రేమలో ప్రేమికులందరూ బిచ్చగాళ్ళలా ప్రేమ కోసం ఒకరినొకరు అడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే, ప్రేమే వారికి పౌష్టికాహారం. కానీ, ఇద్దరూ బిచ్చగాళ్ళే. అందుకే ఇద్దరి ముష్టి చిప్పలూ ఎప్పడూ ఖాళీగా ఉంటాయి. అందరూ ప్రేమిస్తున్నట్లుగా నటిస్తున్నారే కానీ, నిజానికి, ఎవరూ ప్రేమించట్లేదు. కేవలం ప్రేమ పేరుతో ఒకరినొకరు దోచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే అలాంటి ప్రేమికుల ముష్టి చిప్పలు ఎప్పడూ ఖాళీగానే ఉంటాయి. దానితో వారు కలహించుకోవడం ప్రారంభిస్తారు. బిచ్చగాళ్ళతో ఇదే తంటా.
స్ర్తీపురుషులు భిన్న ప్రపంచాలలో జీవిస్తారు. కాబట్టి, వారి మధ్య అవగాహనారాహిత్యపు సమస్యలుంటాయి. పురుషుని మనసు అటూ ఇటూ పోతూనే ఉంటుంది. కానీ, స్ర్తీ మనసు బాణంలా సూటిగా వెళ్తుంది. పురుషుడు తెలివితేటలతో ఆలోచిస్తే స్ర్తీ సహజ జ్ఞానంతో ఆలోచిస్తుంది. అందుకే అక్కడ కలయిక ఉండదు.
సెక్స్ ను సహజమైనదిగా పరిగణించాలి. కానీ, దానిని మనం చాలా గంభీరమైనదిగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే, వేల సంవత్సరాలుగా మన మతాలు, సంస్కృతులు సెక్స్ ను బలవంతంగా అణిచెయ్యాలని అందరికీ బోధించాయి. అదే అన్నిరకాల ఘర్షణలకూ, అసూయలకూ మూలకారణం. తమ జీవిత భాగస్వామితో ఘర్షణపడే వ్యక్తులందరూ సెక్స్ విషయంలో అణచివేతకు గురైనవారే. అందుకే వారు గూఢచారులుగా తయారై తమ భాగస్వామి కదలికలను చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు.
ప్రేమే మీ ఊపిరిగా ప్రేమించడమెలాగో మీరు నేర్చుకోవాలి. శ్వాస మీ శరీరానికి ఎంత అవసరమో ప్రేమ మీ ఆత్మకు అంతే అవసరం. మీ ఆత్మ శ్వాసక్రియే ప్రేమ. మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఉన్నతమైన ఆత్మను కలిగిఉంటారు. కాబట్టి, అసూయతో ఉండకండి. ఎవరినీ అడ్డుకోకండి. ప్రేమపై గుత్తాధిపత్యం కోసం పాకులాడకండి. అలా చేస్తే ప్రేమ నశిస్తుంది.
అబ్బాయి అమ్మాయిని తాకలేక చిన్న రాయిని ఆమె పైకి విసురుతాడు. ఎందుకంటే, తాను తాకిన రాయైనా ఆమెను తాకుతుందని వాడి భావన. ఎందుకంటే, వారు దగ్గరగా ఉండటాన్ని సమాజం అంగీకరించలేదు. అందుకే వాడు దూరం నుంచే చిన్న రాయితో ఆమెను తాకుతాడు. ఎందుకంటే, సరళమైన “ప్రేమించే కళ” గురించి ఎవరూ ఎవరికీ బోధించలేదు. అందుకే పరిస్థితి అలా తయారైంది.
ఈ దేశంలో తమ భర్త చితి మంటల్లోకి దూకి అనేక వేల మంది స్ర్తీలు సజీవదహనమయ్యారు. అది భర్త ఆధిపత్య భావనను సూచిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే, తాను జీవించి ఉన్నప్పడు తన అధీనంలో ఉండాలనుకోవడం మాత్రమే కాదు, తాను మరణించిన తరువాత ఏం జరుగుతుందో అని అతని భయం. అది కేవలం స్ర్తీలకు మాత్రమే వర్తించడం మనకు కనిపిస్తుంది. గడచిన పదివేల సంవత్సరాలలో స్ర్తీ చితి మంటల్లోకి ఒక్క పురుషుడు కూడా దూకలేదు. స్ర్తీ సహనాన్ని, ఔన్నత్యాన్ని తెలిపేందుకు ఇంతకన్నా ఏమి కావాలి?
అంతిమ నిర్ణయానికి వచ్చేందుకు పురుషుడు చాలా ఆలోచిస్తాడు. కానీ, స్ర్తీ చాలా అలవోకగా అంతిమ నిర్ణయానికి వచ్చేస్తుంది. అందుకే మీరు స్ర్తీని, ముఖ్యంగా మీ భార్యను మోసగించలేరు. ఎందుకంటే, మీరేంచెప్పినా ఆమె వినిపించుకోదు. ఎందుకంటే, మీరు చెప్పేదంతా అబద్ధమని ఆమెకు తెలుసు. అందుకే ఆమె మీ కళ్ళల్లోకి చూస్తూ మీ దొంగ వాలకాన్ని గమనిస్తుంది. పాపం, మీరు మీ సాకులన్నీ మీ ముందున్నదానికే సిద్ధం చేసుకుని వస్తారు. పైగా, మీ వెనకాల ఒక దారి ఉందనే సంగతే మీకు తెలియదు. అందుకే ఆమె మీ వెనక దారి నుంచి వస్తుంది. దానితో మీరు వేసే వెధవ వేషాలన్నీ ఆమెకు తెలిసిపోతాయి.
ప్రేమను బానిసత్వంలో ఉంచేందుకే మనం ప్రయత్నించాం. అందుకే అది కపట ప్రేమగా తయారవుతుంది. అదంతే. లేకపోతే, చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు భార్యాభర్తలు “I Love You” చెప్పుకుంటారు. కానీ, వారి కళ్ళలో ప్రేమ ప్రకాశపు మెరుపు, వారి ముఖాలపై దివ్యత్వం మీకు ఏమాత్రం కనిపించదు. వారి చుట్టూ ప్రేమ సుగంధం ఉండదు. వారి మధ్య ప్రతీదీ నిర్జీవంగా ఉంటుంది.