ఏ వ్యక్తి సమక్షంలో మీరు అకస్మాత్తుగా సంతోషానికి గురై మీ హృదయం పరవశించి పులకిస్తుందో, ఏ వ్యక్తి సమక్షంలో మీరు సామరస్యానికి లోనై పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో వారితో కేంద్రీకృతమై వారి కోసం ఏదైనా చేసేందుకు మీరు మరింత సిద్ధంగా ఉంటారో, అదే ప్రేమంటే.
పెళ్ళి ఒక వల. స్ర్తీపురుషులు ఆ వలలో చిక్కుకుని ఒకరినొకరు చట్టబద్ధంగా, శాశ్వతంగా హింసించుకునేందుకు అనుమతించబడతారు. ప్రత్యేకించి ఈ దేశంలో ఈ జన్మలోనే కాదు, జన్మజన్మలకు అది వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే, పెళ్ళి ఏడు జన్మల బంధం మన దేశంలో. కాబట్టి, చనిపోయిన తరువాత కూడా విడాకులు కుదరదు.
పెళ్ళి ఉపఫలమే విడాకుల వ్యవహారం. కాబట్టి, పెళ్ళి అదృశ్యమైతే విడాకుల వ్యవహారం దానంతటదే అదృశ్యమవుతుంది. అనేక శతాబ్దాలుగా “వేశ్యలు ఎందుకున్నారు? వారినెవరు సృష్టించారు? వారి దరిద్ర పరిస్థితికి బాధ్యులెవరు?” అనే వాస్తవాల పట్ల ఎవరూ దృష్టి సారించరు. వివాహ వ్యవస్థే అందుకు కారణం.
పెళ్ళి ప్లాస్టిక్ పువ్వు లాంటిది. ప్రేమ అసలైన గులాబీ. కానీ, మనుషులు అసలైన గులాబీలతో జీవించడానికి భయపడి ఛస్తారు. రక్షణ, పూచీ, స్థిరత్వాల కోసం వారు పేరాశ పడుతుంటారు. అందుకే వారు అసలైన గులాబీతో ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. అయితే ప్లాస్టిక్ పువ్వులు మిమ్మల్ని తృప్తిపరచలేవు.
పెళ్ళి సహజమైనది కాదు. అది ప్రకృతికి విరుద్ధంగా ఉండే మనం సృష్టించుకున్న ఒక సామాజిక ఏర్పాటు, అసహ్యకరమైన వ్యవస్థ. కాబట్టి, పెళ్ళి కేవలం అనుమతి పొందిన వ్యభిచారమే అవుతుంది. నిజం చెప్పాలంటే, భార్యకు, వేశ్యకు పెద్ద తేడా ఏమీ లేదు. భార్య సొంత కారు, వేశ్య అద్దె కారు. ప్రేమ నుంచి ఎదిగినదే అసలైన పెళ్ళి.
పురుషుడు మీ భర్త అయినంతమాత్రాన మీరు కేవలం అతని కామదాహం తీర్చడం కోసమే ఉన్నట్లు కాదు. ఏ స్ర్తీ అయినా “ఇక తప్పదురా” అనుకుంటూ సెక్స్ లో పాల్గొనడమనేది వ్యభిచారమే అవుతుంది. అది కూడా చిల్లర వ్యభిచారం కాదు, టోకు వ్యభిచారం. చిల్లర వ్యవహారమే మెరుగైనది. ఎందుకంటే, అక్కడ కాస్త మార్పుకు అవకాశముంటుంది. కానీ, టోకు వ్యభిచారంలో అలాంటి అవకాశం ఏమాత్రముండదు.
పెళ్ళి చేసుకునేందుకు మీరు గుడికో, చర్చికో వెళ్ళడమనేది దేవుడి సమక్షంలో ఏదో ఘనంగా జరగబోతోందని మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకునేందుకు సృష్టించుకున్న బూటకపు వాతావరణమే తప్ప, అక్కడ జరగబోయేది ఏమీ ఉండదు. మీకు పెళ్ళైపోగానే “అయ్యో పాపం, వీళ్ళకి పెళ్ళైపోయింది. మళ్ళీ ఇలాంటిది చూడాల్సివచ్చిందేమిటిరా బాబూ” అని దేవుడు తలబాదుకుంటూ విలపిస్తాడు.
పెళ్ళి పేరుతో ఇద్దరు వ్యక్తులను కట్టేస్తే వారి మధ్య స్వేచ్ఛ పోయి కోపం పుడుతుంది. దానితో అంతా అసహ్యంగా తయారవుతుంది. అంటే, పెళ్ళి ఇద్దరు వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తున్నట్లే కదా! స్వేచ్ఛను చెక్కుచెదరకుండా ఉంచడమే ప్రేమంటే. కానీ, మీరు మీ స్వేచ్ఛను భద్రత, దక్షత లాంటి రకరకాల నేరాలకు నివేదన చేసేందుకు సిద్ధపడతారు.
స్వేచ్ఛను అర్థం చేసుకున్న పెళ్ళే అసలైన పెళ్ళి. అలాంటి దంపతుల మధ్య అన్నీ పంచుకోవడం ఉంటుందే కానీ, ఎలాంటి బానిసత్వం ఉండదు. అదే అసలైన ప్రేమతో కూడిన వివాహబంధం. అదే అసలైన పెళ్ళి. అలాంటి బంధంలో దంపతులిద్దరూ అసలైన స్వేచ్ఛను అనుభవిస్తూ ప్రేమలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు.
పెళ్ళి సంప్రదాయం చట్టబద్ధమైన బానిసత్వం. ప్రేమ హృదయానికి సంబంధించినది, పెళ్ళి మనసుకు సంబంధించినది. పెళ్ళి ద్వారా ప్రేమ చాలా అరుదుగా సంభవిస్తుంది. మహా అయితే, స్నేహం, సానుభూతి లభిస్తాయి తప్ప, ప్రేమ లభించదు. ప్రేమ సజీవమైనది, ఉద్వేగపూరితమైనది. సానుభూతి కాస్త గోరువెచ్చగా ఉండే నిరుత్సాహకరమైనది.
పురుషులు బాహ్య ప్రపంచంలో చాలా హింసకు గురి అవుతారు. కనీసం ఇంటిదగ్గరైనా వారికి శాంతి కావాలనిపిస్తుంది. అందుకే వారు భార్యావిధేయులుగా రాజీపడతారు. ప్రతి భార్య తన భర్తను తనకు విధేయుడుగా చేసుకునేందుకే ప్రయత్నిస్తుంది. కానీ, గుర్తుంచుకోండి, భార్యావిధేయుడైన భర్తను ఏ స్ర్తీ ప్రేమించదు.
పరిపూర్ణత్వం అంటే మరణమే. ఈ ప్రపంచంలో పరిపూర్ణత్వం ఎక్కడా కనిపించదు. ఈ ప్రపంచం అసంపూర్ణత్వం ద్వారా జీవిస్తోంది. ఎందుకంటే, అసంపూర్ణత్వంలోనే వృద్ధి చెందడం, పరిణామం చెందడం ఉంటుంది. పరిపూర్ణత్వమంటే మీరు చిట్టచివరికి వచ్చేసినట్లే. అక్కడి నుంచి ముందుకెళ్ళేందుకు ఏమీ ఉండదు.
భర్త తనని ఎక్కడ వదిలేస్తాడో అని భార్య, భార్య తనని ఎక్కడ వదిలేస్తుందో అని భర్త ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. అలా ఇద్దరూ అసూయపడుతూ, నిరంతర భయంతో ఒకరినొకరు కాపలా కాస్తూ, శత్రువులుగా మారతారే కానీ, స్నేహితులుగా మారరు.
పెళ్ళి ఆధ్యాత్మిక వ్యవహారంగా ఉండాలే కానీ, భౌతిక వ్యవహారంగా ఉండకూడదు. మీరు ఏ పురుషునితోనో, స్ర్తీతోనో కలిసి ఉన్నప్పుడు మీకే తెలియకుండా ఏదో అద్భుతమైన సంగీతం మీలోంచి చొచ్చుకొస్తున్న అనుభూతి మీకు లభిస్తే వారితో మీరు స్థిరపడండి. లేకపోతే, తొందరపడాల్సిన పనిలేదు.
పక్కింటి వాడి పెళ్ళాం మీకు బాగా నచ్చిందన్న సంగతి మీకు తెలుసు. మీలాగే మీ భార్య కూడా ఆలోచిస్తుందని మీరు ఊహించగలరు. పక్కింటి ఆవిడ మొగుడు తనకు బాగా నచ్చాడన్న సంగతి మీ భార్యకు తెలుసు. కానీ, ఆమె మీలా అంతకన్నా ముందుకు పోలేదు. ఎందుకంటే, మీరు ఆమెను అనేక రకాలుగా కాపలా కాస్తూ ఉంటారు.
ప్రపంచంలోని ఏ సంస్కృతి పురుషునితో సమానంగా స్ర్తీని అంగికరించలేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్ర్తీ అణచివేయబడింది. పురుషునికి పూర్తి స్వేచ్ఛ ఉండడం, స్ర్తీకి ఏమాత్రం స్వేచ్ఛ లేకపోవడం వల్ల అణచివేయబడ్డ స్ర్తీ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, ఆమె వ్యక్తిత్వం మొత్తం అసూయగా పరిణమించింది.
స్ర్తీ ఎప్పుడూ ఎవరో ఒకరికి చెందినదై ఉండాలని కోరుకుంటుంది. ఆలంబన కోరుకోవడం స్ర్తీ సహజ స్వభావం. తనదిగా చేసుకోవడం, పరాధీనతలో ఉండడం, మరొకరి ఆలంబనలో ఉండాలనుకోవడం స్ర్తీ మనస్తత్వంలోని భాగాలే.
వయసు పైబడుతున్నకొద్దీ స్ర్తీలు తమ అందం, ఆకర్షణ ఎక్కడ పోతోయో అనే భయంలో ఉంటారు. “వృద్ధాప్యంలో తనను ప్రేమించేదెవరు? ఎలాంటి ఆకర్షణ లేనప్పుడు తనను ఎవరు ప్రేమిస్తారు?” అనే భయం స్ర్తీ మనసును ఎప్పడూ తొలుస్తూనే ఉంటుంది.
స్ర్తీలు మాత్రమే అసూయాపరులు అనుకోకండి. పురుషులు కూడా చాలా అసూయాపరులే. తమ భార్యలు తమకే అంకితమవాలని వారు కోరుకుంటారు. కానీ, తాము తమ భార్యలకు అంకితం కాలేదని వారికి తెలుసు. ఈ అంకితాలు, లొంగిపోవడాలు కేవలం స్ర్తీల కోసమే.
పురుషుడు బహుభార్యాలోలుడైన జంతువు. అది అతని సహజ ప్రవృత్తి. దానిని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే, అది ఒక అంతర్ నిర్మిత ప్రక్రియ. అలాగే స్ర్తీ కూడా బహుభర్తృత్వలోలురాలే. కానీ, ఆమె అలా కనిపించదు. ఎందుకంటే, ఆమె బయటపడదు.
మీ శరీరం మీకు భగవంతుడిచ్చిన బహుమతులలో ఒకటి. దానిని మీరు మరొకరికి ఒక బహుమతిగా ఇవ్వండి. అంతేకానీ, దానిని మీరు మరొకరికి అమ్మకండి. ఎందుకంటే, మీరు మీ శరీరాన్ని కొనలేదు. అందువల్ల దానిని మరొకరికి అమ్మే హక్కు మీకెక్కడిది?
ప్రేమ లేని పెళ్ళి వ్యభిచారమే అవుతుంది. ఇక తప్పదు కాబట్టి, భార్య భర్తకు లొంగిపోతూ ఉంటుంది. పైగా, అది చట్టబద్ధం కూడా. ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని భర్త భయపెట్టగలడు. అప్పుడు ఆమె వీధిన పడాల్సివస్తుంది. అందుకే ఆమె శాశ్వత వ్యభిచారాన్ని ఎంచుకుంటుంది. లేకపోతే, ఆమె చాలా మందితో తిరిగేదే.
పురుషుడు తన బహుభార్యాలోలత్వాన్ని సంతృప్తి పరచేందుకు వేశ్యలను సృష్టించాడు. వేశ్యలందరూ పెళ్ళి ఉప ఫలితాలే. పెళ్ళి ఈ ప్రపంచం నుంచి అదృశ్యం కానంతవరకు అతి జుగుప్సాకరమైన వేశ్యా వృత్తి అంతం కాదు. మీరు చెయ్యగల అతి జుగుప్సాకరమైన హత్య స్ర్తీని వేశ్యగా చేసి, ఆమెను సర్వనాశనం చెయ్యడమే.
పురుషుడు ముద్దుపెట్టుకునేటప్పుడు స్ర్తీ కళ్ళు మూసుకుంటుంది. కానీ, పురుషుడు ఆమె పొందుతున్న అనుభూతులన్నీ గమనించే పనిలో ఉంటాడు. అయితే, ఆ సమయంలో పురుషుడు పొందే అనుభూతిని స్ర్తీ అంతగా పట్టించుకోకుండా, తన ఉనికి లోలోపల జరిగే దాని పట్ల మాత్రమే ఆమె ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంది.
ఎప్పుడైతే అనుబంధంలో స్వేచ్ఛ ఉంటుందో అక్కడ ఆనందముంటుంది. ఎందుకంటే, స్వేచ్ఛ ఒక్కటే అత్యంత విలువైనది. అంతకు మించినది ఏదీ లేదు. ప్రేమ స్పేచ్ఛ వైపుకు దారితీస్తే అది ఆశీర్వాదమవుతుంది, అదే బానిసత్వం వైపు దారితీస్తే శాపమవుతుంది.
ప్రేమ కోసం ఎదురు చూడకుండా ప్రేమను పంచడమనేది ప్రేమించే కళలో మొదటి పాఠం. ముందు ప్రేమను పంచేవారుగా అవండి. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ ప్రేమను పంచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ప్రతిఫలం దానంతటదే సహజంగా లభిస్తుంది.
సరిజోడీ దొరికితేనే ప్రేమిద్దామనుకుంటూ నిరీక్షించకండి. సరిజోడీ ఎప్పటికీ దొరకదు. కాబట్టి, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. మీరెంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా సరిజోడీ దొరికే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే, వికసించడం ప్రారంభించిన మీ హృదయం అనేక ప్రేమికుల హృదయాలను ఆకర్షిస్తుంది.
“నీది తప్పు కాబట్టి, నిన్ను దారిలో పెట్టాలి” అంటూ ప్రతి భార్య తన భర్తను మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. శాసించేందుకు అది ఒక సూక్ష్మమైన వ్యూహం. భర్తలు తమని తాము రక్షించుకోలేరు. ఎందుకంటే, “తప్పు అని తెలిసినా” వారు ఆ తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకే వారు తమ భార్య నుంచి ఏమాత్రం తప్పించుకోలేరు.
ఇంట్లో పనిమనిషిని పెట్టుకోవడం కన్నా భార్యే చౌక. అలాగే ఈ పోటీ ప్రపంచంలో ఒంటరిగా అవస్థలు పడేకన్నా భర్తే చౌక. ఇలాంటి అనేక కారణాలతో పెళ్ళి చేసుకుంటారు. అలాంటి బంధంలో ప్రేమ ఉండదు. మౌలికమైన ప్రేమే లేనప్పుడు మీరు సంతోషంగా ఉండలేరు. అప్పుడు దుఃఖం అనివార్యమవుతుంది.
విడాకుల వ్యవహారాన్ని సాధ్యమైనంత ఆహ్లాదకరంగా ముగించండి. ఆ వ్యవహారంలో ఆమె వైపు నుంచి ఆమెదే బాధ్యత. మీ వైపు నుంచి మీరు అంతా సవ్యంగా, సరళంగా చెయ్యండి. అప్రసన్నంగా వీడ్కోలు చెప్పకండి. ఎందుకంటే, ఎదుటి వ్యక్తికి మనం ఎప్పుడూ ఎంతో కొంత ఋణపడే ఉంటాం.
భార్యలు తమ భర్తలను మూర్ఖులుగానే పరిగణిస్తారు. కానీ, అది ఆమె సంపూర్ణ చైతన్యం నుంచి వచ్చినది కాకపోవచ్చు. ఎందుకంటే, ఆ విషయం ఆమెకే తెలియకపోవచ్చు. కానీ, ఆమె అంతరంగంలోని భావన మీరు మూర్ఖులనే. అయినా, వారు నిజంగా ఎంత మూర్ఖులు కాకపోతే, అలాంటి మూర్ఖుల ప్రేమలో ఎందుకు పడతారు?
భర్త తెలివైనవాడని ఏ భార్య నమ్మదు. సోక్రటీసు భార్య నమ్మలేదు, బుద్ధుని భార్య నమ్మలేదు. ఇంతవరకు తన భర్త తెలివైనవాడని నమ్మిన ఒక్క భార్య కూడా లేదు. ఒకవేళ తన భర్త తెలివైనవాడని ప్రపంచమంతా నమ్మినా, ఆమె నమ్మదు.
ప్రేమ ప్రమేయం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్న చాలా దేశాలలో సంభోగం శారీరక స్థాయి దగ్గరే ఆగిపోయింది. అది ఎప్పటికీ ఆ స్థాయి దాటి ముందుకెళ్ళదు. ఎందుకంటే, పెళ్ళి రెండు శరీరాలకు చేస్తున్నారే కానీ, ఆత్మలకు కాదు. కేవలం ఆత్మల మధ్యే ప్రేమ సంభవిస్తుంది.
మతంలో మునిగిన వాడికి సంభోగంతో పని లేదని, సంభోగేచ్ఛ ఉన్నవాడికి ఆధ్యాత్మికత అందదని అందరూ అనుకుంటున్నారు. కానీ, రెండూ భ్రమలే. కామం వైపు ప్రయాణమంటే కాంతి వైపు ప్రయాణమని, విపరీతమైన సంభోగేచ్ఛ అంటే ఉదాత్తమైన దాని కోసం అన్వేషణ అని అర్థం.
ప్రేమ లేని పెళ్ళిలో సంభోగం చాలా యాంత్రికంగా ఉంటుంది. అది వేశ్యతో సంభోగం లాంటిదే. వేశ్య ఒక రాత్రికి, భార్య జీవితం మొత్తానికి, అంతే తేడా. ఎందుకంటే, ప్రేమ లేనప్పుడు అది కొనడమే అవుతుంది. అయితే రోజూ ఉండే సాహచర్యం వల్ల ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది. దానినే మనం ప్రేమ అంటున్నాం. కానీ, అది ప్రేమ కాదు.
పురుషుడి లైంగిక వాంఛ స్థానికం. ఎందుకంటే, అది జననాంగానికే పరిమితం. కానీ, స్ర్తీ లైంగిక వాంఛ సంపూర్ణం. ఎందుకంటే, అది ఆమె జననాంగానికి మాత్రమే పరిమితం కాదు. కాబట్టి, రతిక్రీడలో పాల్గొనడానికి ముందు శరీరమంతా కామప్రేరణలు రేకెత్తించే సరససల్లాపాలు ఆమెకు చాలా సేపు అవసరం.