దేవుడికి అస్తిత్వం లేదు. కాబట్టి, “దేవుడున్నాడు” అనేది అబద్ధం. వార్థక్యం, మృత్యువు లాంటి అనేక భయంకరమైన వాటి గురించి భయపడే ప్రజలను దేవుడు ఓదారుస్తాడు. కాబట్టి, అబద్ధాలు కూడా మిమ్మల్ని చక్కగా ఓదార్చగలవు. కాబట్టి, మనిషికి ఊరట కలిగించేందుకు సృష్టించబడిన దేవుడు, స్వర్గం, నరకం లాంటివన్నీ అందమైన అబద్ధాలే.

“ఇదే సత్యం” అని చెప్తూ పూజారులు “దేవుడు” అనే అబద్ధాన్ని మీ చేతిలో పెట్టారు. సత్యం మీ చేతిలో సిద్ధంగా ఉండడంతో మీరు సహజంగానే సత్యాన్వేషణను ఆపేస్తారు. దానితో బుద్ధత్వం దిశగా సాగే మీ పరిణామక్రమం ఆగిపోతుంది. కాబట్టి, దేవుడు మరణించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కట్టుకథ లాంటి దేవుడు బాధల్లో ఉన్న మిమ్మల్ని ఓదారుస్తాడు. కానీ, ఆ ఓదార్పు సరియైనది కాదు. అది మీరు వాస్తవాన్ని తెలుసుకోకుండా చేసే “Opium” లాంటి మత్తు పదార్థం మాత్రమే. కాబట్టి, దానివల్ల మీ జీవితకాలమంతా చాలా వేగంగా గతంలోకి జారుకుంటూ కర్పూరంలా కరిగిపోతుంది.

ప్రార్థన బహిర్ముఖమైనది, ధ్యానం అంతర్ముఖమైనది. ధ్యానం మిమ్మల్ని బుద్ధునిగా చేస్తుంది, ప్రార్థన మిమ్మల్ని బిచ్చగాణ్ణి చేస్తుంది. ధ్యానానికి సత్యం ఆధారమైతే, ప్రార్థనకు కట్టుకథ ఆధారం. ధ్యానమే జెన్. ప్రార్థన “దేవుడు” అనే కట్టుకథలోని చిన్న భాగం మాత్రమే.

దేవుడితో పెట్టుకుంటే మనిషి బానిస అయినట్లే. మహా అహంకారపరులైన ఎందుకూ పనికిరాని రక్షకులను, ప్రవక్తలను, మహాపురుషులను గుడ్డిగా నమ్ముతూ పవిత్ర గ్రంథాలు, రాతి శిల్పాలు, మట్టి విగ్రహాల ముందు ఒక బానిసలా మోకరిల్లి దేవుడిని ప్రార్థిస్తూ బిచ్చగాడిలా అడుక్కోవలసిందే. మొత్తం మానవాళి ఒక గొప్ప ఆధ్యాత్మిక బానిసత్వం దిశగా పురిగొల్పబడింది.

ప్రతి మతం మీ చైతన్య పరిణామాన్ని నాశనం చేసేదే. అసలు మతమే చాలా ప్రమాదకరం. ఏకేశ్వరవాద మతం మరీ ప్రమాదకరం. కాబట్టి, మీరు మతాన్ని వదిలించుకున్నప్పుడే ధార్మికులు కాగలరు. అప్పుడే మీరు ఈ అస్తిత్వంతో, అనంత విశ్వంతో నేరుగా అనుసంధానం కాగలరు.

“దేవుడు” అనేది కేవలం కట్టుకథ. అది మీకు చెయ్యబోయేది ఏమీ లేదు. ఎందుకంటే, “దేవుడు” అనేవాడు ఎక్కడా లేడు. ఎందుకంటే, దేవుడు ఒక వ్యక్తి కాడు. కాబట్టి, మీరు ఉన్నాడనుకుంటున్న ఎక్కడా లేని దేవుణ్ణి మీరు వదిలించుకోనంత వరకు, మీరు దీనాతిదీనంగా జీవించవలసిందే.

రక్షకులు, పూజారులు, ప్రవక్తలు లాంటి మధ్యవర్తులతో కూడిన “దేవుడు” మానవ చైతన్య పరిణామ వికాసానికి పెద్ద ప్రతిబంధకం. ఎందుకంటే, దేవుడు ప్రజలను ఏదో భ్రాంతికి గురిచేస్తూ, వారి తెలివితేటలను నాశనం చేస్తూ, వారు బుద్ధత్వం పొందే అవకాశాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు.

దైవాధార మతం మీలో అందంగా నిక్షిప్తమై ఉన్న దానిని పీల్చి పిప్పి చేసి, అన్ని రకాల పరాన్నజీవులతో మిమ్మల్ని దోచి, మిమ్మల్ని ఎందుకూ పనికిరానివానిగా చేస్తుంది. కాబట్టి, దేవుడే అంతిమ పరాన్నజీవి. అందుకే వాడు ఎప్పుడూ మిమ్మల్ని భయపెడతూ ఉంటాడు. కాబట్టి, దేవుణ్ణి ధైర్యంగా వదిలెయ్యండి. అప్పుడే మీరు స్థిమితపడతారు.

మీరు మీ బాధ్యతను దేవుడికి అప్పజెప్పడంతో పాటు, మీ స్వేచ్ఛను కూడా ఆయన చేతుల్లో పెట్టి మీరొక కీలుబొమ్మలా అవుతున్నారన్న సంగతి మీకు తెలియట్లేదు. దేవుడు రోగభూయిష్టమైన ఊహాలోకమని మీకు తెలిస్తే అది మిమ్మల్ని పూర్తి ఆరోగ్యవంతునిగా చేస్తుంది.

మీలోని భయం, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. వాటివల్లే ప్రార్థన పుడుతుంది. మతాచార్యుడు వస్తాడు. వ్యవస్థీకృత మతం తయారవుతుంది. చర్చిలు, దేవాలయాలు, మసీదులు వెలుస్తాయి. కాబట్టి, అంతిమ అసత్యం దేవుడే.

అంతిమ అసత్యం దేవుడే. అందుకే వాడి చుట్టూ అనేక అసత్యాలు అల్లుకున్నాయి. ఎందుకంటే, అసత్యం ఒంటరిగా జీవించలేదు. దాని మనుగడకు అనేక అసత్యాల తోడు కావాలి. అందుకే దైవాధార మతాలన్నీ అంతిమ అసత్యమైన దేవుడికి ఆలంబనగా అనేక అసత్యాలను సృష్టించాయి. దేవుడు ఒక కట్టుకథ. కాబట్టి, దేవుడిపై ఆధారపడినదేదైనా అసత్యమే.

కట్టుకథ లాంటి దేవుడి భావన కన్నా మెరుగైన భావనను సృష్టించలేని మనిషి ఏమంత సృజనాత్మకుడు కాడు. ఒకవేళ మెరుగైన దేవుడిని మనిషి సృష్టించినా అది కూడా కాస్త మెరుగైన కట్టుకథే అవుతుంది. మెరుగైన దేవుడు మెరుగైన జైలు, మెరుగైన విషం లాంటి వాడు. కాబట్టి, మెరుగైన దేవుడు మరింత మెరుగైన చాకచక్యంతో మిమ్మల్ని ముంచేస్తాడు. అలాంటి దేవుడు మీకు కావాలా?

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com