దేనినీ పరిత్యజించకుండా, భగవంతుడు బహుమతిగా ఇచ్చిన జీవితం ప్రసాదించే అన్ని అందాలను, ఆనందాలను ఆస్వాదిస్తూ, పరమానందంతో నిరంతరం వేడుక చేసుకోవడమే అసలైన సన్యాసం.
మీ ధ్యాన శక్తిని, మీ ఎరుకను మృత్యువు మీ నుంచి కబళించలేదు, వాటిని నాశనం చెయ్యలేదు. ఎందుకంటే, అవి మీలో ఎదిగిన అంశాలు. కాబట్టి, అవే మీ జీవితానికి ముఖ్యమైనవి. మిగిలినవన్నీ మీ జీవితానికి అనవసరమైన విషయాలే. ఎందుకంటే, అవన్నీ మీలో ఎదిగి, మీ నుంచి వచ్చినవి కావు. అందుకే మృత్యువు వాటిని కబళించగలదు, నాశనం చెయ్యగలదు.
మరణం జీవితానికి ముగింపు కాదు. అది జీవితం పరాకాష్ఠకు చేరుకున్నదని తెలిపే పతాక సన్నివేశం. అదే జీవిత పరమావధి. మీరు ప్రతి క్షణం సరిగా, సంపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించి ఉంటే, మీ మరణం మీకు కచ్చితంగా “అంతిమ భావప్రాప్తి” అనుభవాన్ని అందిస్తుంది.
జీవాన్ని వ్యతిరేకించడం కోసం కనుక్కున్న అన్ని మతాల దేవుళ్ళు జీవిత అంతర్గత కేంద్రంలోని వారు కారు. అందుకే నేటికీ మానవాళి ఘోరమైన దుఃఖంలో జీవిస్తోంది. ఎందుకంటే, జీవితాన్ని త్యజించడమంటే మృత్యువును గౌరవిస్తున్నట్లే.
దేవాలయాలు, చర్చిలు, సినగాగులు, మసీదులు, గురుద్వారాలలో మీరు ఎవరిని పూజిస్తున్నారు? జీవించి ఉన్న మీరు మరణించిన వారిని పూజిస్తున్నారు. అంటే మీరు మృత్యువును ఆరాధిస్తున్నట్లేకదా. అలా మతాలన్నీ మీపై తప్పుడు బోధనల విషప్రయోగం చేసినందువల్లనే పరమానందభరితంగా సాగవలసిన మీ జీవితం ఊయల నుంచి శ్మశానం వరకు చాలా విషాదకరంగా సాగుతోంది.
ధ్యానం అగ్నిలాంటిది. అది గతం ద్వారా మీకు వారసత్వంగా సంక్రమించిన చెత్తను పూర్తిగా దహించేస్తుంది. అప్పుడు మీరు ఏ కళనైనా ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరముండదు. ఎందుకంటే, అవన్నీ వాటంతటవే మీలో ఉద్భవిస్తాయి.
కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే. కానీ, ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి వెలువడే సుగంధ పరిమళం. ప్రేమకు శరీరంతో, హర్మోన్ల రసాయనిక చర్యతో ఏమాత్రం పని లేదు. భౌతిక శరీరాన్ని అధిగమించి, చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ.
మీరు ప్రకృతిని మార్చలేరు. మీరు సహజంగా జీవించగలిగితే మార్పులు వాటంతటవే జరుగుతాయి. అప్పుడు సెక్స్ సహజంగా దానంతటదే అదృశ్యమవుతుంది. అంతేకానీ, మీరు బలవంతంగా దానిని అణిచేందుకు ప్రయత్నించినంత మాత్రాన అది అదృశ్యమవదు. అలా చేస్తే అది మిమ్మల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. మీరు దానితో కలిసి ఎంతగా జీవిస్తే అంతగా అది మిమ్మల్ని వదిలిపోతుంది.
మనిషికి అత్యధమ స్థాయి నుంచి అత్యున్నతస్థాయి వరకు చేరుకోగల అద్భుతమైన విస్తృతి ఉంది. ఎందుకంటే, మనిషి నిచ్చెనలాంటి వాడు. అందుకే మనిషి దేవుళ్ళకంటే ఉన్నతంగా ఎదగగలడు, జంతువులకన్నా హీనంగా పతనమవగలడు.
అహం ఎప్పుడూ పోల్చుకుంటూ రోగిష్టిదిగా ఉంటుంది. అందుకే అది చాలా అసహ్యంగా ఉంటుంది. ఆత్మగౌరవమంటే ఎలాంటి పోలిక లేకుండా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. ఆత్మాభిమానమంటే హుందాతనం. అంటే ఈ అస్తిత్వం మీరు కావాలని కోరుకుంటూ మిమ్మల్ని సృష్టించి తన ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించినందుకు మీరు తెలిపే హుందాతనమే ఆత్మాభిమానమంటే.
నకిలీ వినయం కేవలం అణచుకున్న అహంకారమే. అతి వినయాన్ని నటించడమనేది కేవలం అందరికన్నా అత్యున్నతంగా కనిపించాలని ఆశించడమే. ప్రామాణికమైన వినయానికి అహంతో ఏమాత్రం పని లేదు. నిజానికి, అహం లేని స్థితే వినయం.
మీరు మరణించిన ప్రతిసారి మీతో పాటు మరణించేది, అలా ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ మరణించేది కేవలం ఒక్క అహంకారం మాత్రమే. మీలో ఉన్న భయాలన్నింటికీ మూలకారణం మీ అహంకారమే. ఎందుకంటే, ఒక్క అహం తప్ప మీలో భయపడేది ఏదీ లేదు. ఎందుకంటే, ఒక్క అహం మాత్రమే మీలో ఉన్న ఏకైక అవాస్తవం.
ధ్యాన మార్గానికి ప్రేమ ఒక పరీక్ష. ఎందుకంటే, ప్రేమ, ధ్యానం ఒకే నాణేనికి చెందిన రెండు పార్శ్వాలు. అలాగే అవి ఒకే శక్తికి చెందిన రెండు కోణాలు. ఒకటి ఉంటే రెండవది ఉంటుంది. ఒకటి లేకపోతే రెండవది ఉండదు.
ధ్యానమంటే ఏకాగ్రత కాదు. ధ్యానమంటే మీరు ఏమీచెయ్యకుండా, ఏదీ ఆలోచించకుండా, ఏమాత్రం ఆవేశపడకుండా మీ సన్నిధిలో మీరు పూర్తి విశ్రాంతి స్థితితో కూడిన చైతన్యంతో ఊరికే ఆనందిస్తూ ఉండడం. అదే పరిపూర్ణ ఆనందం.
ఎవరైతే ఎరుకతో మరణిస్తారో వారు ఎరుకతో జన్మిస్తారు. అలాగే, ఎవరైతే అచేతనంగా మరణిస్తారో వారు అచేతనంగా జన్మిస్తారు. ఎరుకతో జన్మించిన వ్యక్తి సరియైన గర్భాన్ని ఎంచుకోగలడు. కానీ, అచేతనంగా మరణించిన వ్యక్తికి సరియైన గర్భాన్ని ఎంచుకునే అర్హత ఉండదు. అందుకే అలాంటి వ్యక్తులకు గర్భం అనుకోకుండా లభిస్తుంది.
పూర్వనిశ్చితాభిప్రాయాలతో జీవించే వ్యక్తుల జీవితం చాలా మృతప్రాయంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ సందర్భోచిత సంబంధంలో ఉండరు, సద్యస్ఫూర్తితో స్పందించరు, వాస్తవాన్ని తెలుసుకోరు. అందుకే వారి అభిప్రాయాలు వర్తమానానికి వర్తించవు. ఎందుకంటే, వారు ఎప్పుడూ పూర్వనిశ్చితాభిప్రాయాలతో ఉంటారు.
కేవలం ఎరుక మాత్రమే పవిత్ర ధర్మం. అది లేకపోవడమే పాపం. కాబట్టి, ఎరుక లేకుండా చేసేది ఏదైనా పాపమే, పూర్తి ఎరుకతో చేసేది ఏదైనా ధర్మమే. ఎరుక లేకపోవడమంటే మీరు కటిక చీకటిలో ఉన్నట్లే. అప్పుడే అన్ని రకాల శత్రువులు మీలోకి ప్రవేశిస్తారు.
ఏదైతే గతం నుంచి, జ్ఞాపకాల నుంచి, ఆలోచనల నుంచి ప్రతిస్పందనగా వస్తుందో అది కర్మ అవుతుంది. అక్కడ ఎంచుకునేది, నిర్ణయించేది మీరే. కాబట్టి, మీరు చేసే ఆ కర్మ మీ ఎరుకరాహిత్యం నుంచి వస్తుందే కానీ, ఎరుక నుంచి రాదు. అందుకే అది పాపంగా పరిగణించబడుతుంది.
కేవలం రెండు వైపుల నుంచి పరిపూర్ణమైన ఎరుకతో కూడిన ధ్యానపూర్వకమైన ప్రేమ మాత్రమే అసలైన ప్రేమ అవుతుంది. రెండు ఇప్పుడులు, రెండు ఇక్కడలు కలవడం, రెండు సాన్నిధ్యాలు ఒకదానిలో మరొకటి లీనమవడమే అసలైన ప్రేమ. అప్పుడే ఆ ప్రేమ ఆధ్యాత్మిక గుణాన్ని సంతరించుకుంటుంది. అదే ఆధ్యాత్మిక ప్రేమ.
ఎరుక లేకపోవడమంటే మీరు వక్రమార్గంలో ఉన్నట్లే. అప్పుడు మీరు మంచి చేసినా, చెడు చేసినా మీరు పాపిగా మిగిలిపోతారే కానీ, ఋషి కాలేరు. ఎందుకంటే, వక్రమార్గంలో మీరు ఎప్పుడూ సక్రమమైన దానిని చెయ్యలేరు.
నిజానికి, నిజమైన ప్రేమను పదే పదే వ్యక్తపరచవలసిన పని లేదు. ప్రేమరాహిత్యానికే అలాంటి అవసరముంటుంది. ఎందుకంటే, హృదయంలో ప్రేమ లేనప్పుడు ఆ ఖాళీని మీరు పదే పదే వట్టి మాటలతో నింపుతారు.
దురాశ మీలోకి ప్రవేశించిన వెంటనే మీలోని సృజనాత్మకత అదృశ్యమవుతుంది. ఎందుకంటే, దురాశాపరుడు సృజనాత్మకుడు కాలేడు. ఏ క్రియాశీలతను అతడు కావాలని ప్రేమించలేడు. కానీ, సృజనాత్మకుడు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాడు.
అధికారమంటే మీరు చాలా మందిని అసమర్థులుగా చేసి, వారిని నాశనం చెయ్యడమే. అప్పుడే మీరు శక్తిమంతులవుతారు. కానీ, అవన్నీ విధ్వంసక చర్యలని గుర్తుంచుకోండి. ఎందుకంటే, అధికారం వెంటపడేవాడెవడైనా బిచ్చగాడే. అందుకే అలాంటి వ్యక్తులందరూ ఎప్పుడూ అడుక్కుంటూ ఉంటారు.
కాస్త అసంపూర్ణంగా ఉన్న దానిలోనే జీవముంటుంది. అది ఎప్పుడూ అసంపూర్ణతను సంపూర్ణం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అదే జీవితం. వికార కురూపిని అపురూప సుందరిగా చెయ్యాలనే దురాశే జీవితం. కాబట్టి, జీవితం కొనసాగాలన్నా, ఎదుగుతూ ప్రవహించాలన్నా కాస్త అసంపూర్ణంగా ఉండడం చాలా అవసరం.