విశ్వమానవాళి ఆధ్యాత్మిక చైతన్య వికాస యాత్రలో ఓషో ఒక నవజీవన స్రవంతి. కొందరు ఆయనను యోగి అన్నప్పుడు చిరునవ్వు నవ్వాడు, మహాభోగి అన్నప్పుడు ఆహా… అలాగా అన్నట్టు మార్మికంగా నవ్వాడు, మానసిక రోగి అన్నప్పుడు పకపకా నవ్వాడు. ఆయనపై పూలవాన కురిసింది, రాళ్ళవాన పడింది. ఎందుకంటే, ఓషో భావజాలం ఏ లెక్కలకు అందదు, ఏ చట్రంలోను ఇమడదు. అందువల్ల ఎవరైనా ఆయనను ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. కానీ, ఆయనను ఎవరూ విస్మరించలేరు.
ఓషో జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని కచ్వాడా గ్రామం. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మోహనచంద్ర రజనీష్. ఆయన తల్లిదండ్రులు బాబూలాల్ జైన్, సరస్వతీబాయి జైన్. వారిది బట్టల వ్యాపారం. బాల్యం నుంచే చాలా చురుకైన రజనీష్ విద్యార్థిగా అసమాన ప్రతిభను కనకబరిచేవాడు. కాలేజీ రోజుల్లో అందరూ ఆయనను రోమియో అనేవారు. ఆ తరువాత ఆచార్యుడైన రజనీష్ 1964లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, అప్పటి వరకు సమాజంలో పాతుకుపోయి ఉన్న సంప్రదాయాలను, మతాలను తర్కబద్ధంగా ఖండిస్తూ, వాటిని గుడ్డిగా అనుసరిస్తున్న వారిని తీవ్రంగా విమర్శించే, వ్యతిరేకించే ఉపన్యాసాలు చెప్పేవాడు. ఎందుకంటే, స్వేచ్ఛ ఆయన ఊపిరి. అందుకే ఆయన అప్పటి వరకు అన్ని రకాలుగా బందీగా ఉన్న స్త్రీ స్వేచ్ఛను, అపోహలలో ఇరుక్కుపోయిన లైంగిక స్వేచ్ఛను ఆకాంక్షించాడు. కాలక్రమంలో మోహనచంద్ర రజనీష్ అన్న పేరు ఆచార్య రజనీష్, భగవాన్ రజనీష్, ఓషో అనే పేర్లుగా రూపాంతరం చెందింది.
రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచ పటాన్ని మార్చేశాయి. ఆధ్యాత్మిక రంగం కూడా 1950కి పూర్వార్థం, ద్వితీయార్థంగా విడిపోయింది. పాశ్యాత్య దేశాలలో… మరీ ముఖ్యంగా బీటిల్స్, హిప్పీల సంస్కృతి పెరిగిపోయిన అమెరికా, జర్మనీ దేశాలలోని యువత స్వేచ్ఛా జీవనం వైపు పరుగులు పెడుతోంది. అలాంటి పరిస్థితిలో పరమహంస యోగానంద, మహేష్‌యోగి లాంటి మహానుభావులు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఒక ఆధ్యాత్మిక వారధిని నిర్మించాలనుకున్నారు. అదే సమయంలో జిడ్డు కృష్ణమూర్తి కూడా తనదైన శైలిలో తాత్వికత దిశగా అడుగులు వేయసాగారు. దాని ఫలితంగా ఆధ్యాతిక రంగంలో అప్పటిదాకా మనపై ఉన్న పాశ్చాత్య భావజాల ప్రభావం తగ్గడం, పాశ్యాత్యులపై భారతీయ తాత్వికత ప్రభావం పెరగడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో భగవాన్ రజనీష్ పేరు జనాలలో మార్మోగసాగింది.
అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగిన రజనీష్‌కు వారంటే ప్రాణం. కానీ, రజనీష్‌కు పదేళ్ళ వయసులోనే వారు మరణించడం ఆ పసి హృదయాన్ని కుదిపేసింది. రజనీష్ బాల్యం నుంచే శశి అనే అమ్మాయిని ఇష్టపడేవాడు. ఆమె కూడా హఠాత్తుగా మరణించింది. ఆ మూడు మరణాలు రజనీష్ ఆలోచనలు, భావుకతలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏ దుర్వార్త విన్నా తీవ్రంగా చలించిపోయేవాడు. ప్రేమించిన వాళ్ళందరూ దూరమవడంతో జీవితంలో ఎవరినీ ప్రేమించకూడదని, ఏకాకిగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. వయసుతో పాటు వైరాగ్యం పెరగడంతో స్కూల్లో మాస్టార్లను మృత్యువు అంటే ఏమిటి? అని అడిగేవాడు. ఆ ప్రశ్నకు ఎవరూ సరియైన సమాధానం చెప్పకపోవడంతో, ఊళ్ళో ఎవరు అంతిమ క్షణాలలో ఉన్నారని తెలిసినా అక్కడికి వెళ్ళి, ఆ వ్యక్తి చనిపోయేదాకా అక్కడే ఉండి, అంతిమయాత్రలో పాల్గొనేవాడు. తరచుగా శ్మశానాలకు వెళ్ళి చితిమంటలను గమనించేవాడు.
శృంగారాన్ని తంత్రం ఆమోదిస్తుంది, యోగం నియంత్రిస్తుంది, సన్యాసం నిషేధిస్తుంది. కామాన్ని నిగ్రహించుకోలేని ఆధ్యాత్మిక సాధకులకు తంత్రం ఆశ్రయమిస్తుంది. శృంగారాన్ని సంపూర్ణంగా అనుభవించిన తరువాత ఏర్పడే నిశ్చలత్వమే బ్రహ్మచర్యం అంటారు రజనీష్. అణచుకునే కన్నా అనుభవించడం మేలు కదా! అనేది ఆయన వాదన. ఎందుకంటే, లైంగికశక్తే ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి. దేన్నైనా సృష్టించాలంటే ఆ దేవుడు కూడా సెక్స్ ను ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే, సెక్స్ నుంచే జీవం పుడుతుంది. పూలు పూసినా, కోకిలలు కూసినా, నెమలి నాట్యం చేసినా… అవన్నీ లైంగికశక్తి సంకేతాలే. కాబట్టి, లైంగికశక్తిని వ్యతిరేకించకండి అంటాడు రజనీష్. ఎందుకంటే, సెక్స్ ను అడ్డుకుంటే అది వ్యభిచారం, స్వలింగ సంపర్కాలనే వికృత్వాలకు దారితీస్తుందని ఆయన బలంగా నమ్మాడు. ఆయన ఆలోచనలను భారతీయులు పచ్చి బూతుగాను, విదేశీయులు విచ్చలవిడి శృంగారంగానూ భావించారే కానీ, వాటిని ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు.
అదే సమయంలో ఆశ్రమానికి విదేశీయుల రాక పెరగడం, ఆశ్రమంలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరడంతో పాటు రజనీష్‌పై హత్యా ప్రయత్నం జరగడంతో అక్కడి నుంచి ఆయన అమెరికాకు మకాం మార్చి, రజనీష్పురం పేరుతో ఆశ్రమాన్ని నిర్మించి, అన్ని మతాలను వ్యతిరేకిస్తూ చేసిన ఆయన ప్రసంగాలు ప్రపంచంలోనే అతి పెద్ద మతమైన క్రైస్తవ మతం పునాదుల్ని కుదిపేయడంతో ఆయనపై నమోదైన అనేక కేసులు ఆయనను జైలు పాలు చేయడంతో పాటు, చివరికి ఆ దేశం వదిలి మాతృదేశానికి వచ్చేసే పరిస్థితులు ఆయనకు కల్పించాయి.
అక్షరం సత్యమైతే మాట వేదమవుతుంది. మనిషికి జ్ఞానోదయమైతేనే అక్షరం సత్యమవుతుంది. అందుకే జ్ఞానోదయం పొందిన ఓషో చెప్పిన ప్రతి అక్షరం సత్యమైంది, ప్రతి మాట వేదమైంది.
ఓషో భాష మైమరపించే హిప్నాటిక్ లాంగ్వేజ్. ఆయన చెప్పిన నాలుగు మాటలు వింటే చాలు మనకు మైకం కమ్మేస్తుంది. ఆయన చెప్పే విషయంలో ఎంత సాంద్రత ఉంటుందో, ఆయన చెప్పే విధానంలో అంత సరళత ఉంటుంది. ఓషో చర్చించని అంశం లేదు. ఎలాంటి ఊగిసలాట లేని ఆయన మాటల్లో సత్యం చాలా సరళంగా సాక్షాత్కరిస్తుంది.
మీలో భయం అంతమైనప్పుడే జీవితం ప్రారంభమవుతుంది. ప్రేమే జీవితం, ప్రేమే దైవం, ప్రేమే సన్యాసం. మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది? అనేది ముఖ్యం కాదు. మరణానికి ముందు ఎలా జీవించావనేదే ముఖ్యం – ఇలా మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశంపైన ఆయన సాధికారికంగా మాట్లాడాడు. వ్యవస్థీకృత మతాలన్నీ ఏమాత్రం జీవం లేనివని, అవి మానవ చైతన్యాన్ని ఏమాత్రం ఎదగనియ్యవని తేల్చి చెప్పిన మహానుభావుడు ఓషో. దేవుడు, మతాలు, ప్రపంచ రాజకీయాలతో వాటికున్న అన్యోన్య సంబంధం; ఆధ్యాత్మికత, లైంగికత, మనిషి చైతన్యాన్ని అవి ప్రభావితం చేసే తీరు; నిజమైన ఆధ్యాత్మిక స్థితి, ధ్యానం, దాని ప్రక్రియలు; వ్యామోహం, మనిషిలోని భయాలు, బలహీనతలు, అవి మనిషికి అవరోధాలుగా ఎలా మారతాయి, వాటిని ఎలా అధిగమించాలి – ఇలా మీరు ఏది అడిగినా దాని గురించి చాలా చక్కగా, సరళంగా, అప్పుడప్పుడు వాటికి ముల్లానస్రుద్దీన్ హాస్య కథలను జోడించి, విశాల దృక్పథంతో సమాజిక పరిధులను కూడా అతిక్రమించి తత్వాన్ని బోధపరిచే ఓషో విధానం, సత్యాన్ని దర్శించిన వ్యక్తిపై ప్రకృతి పూలవాన కురిపిస్తుందని సోదాహరణంగా వివరించే శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రపంచ తాత్విక చింతనా భావజాలాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయింపచేసుకున్న తావో, లావోట్జూ, జెన్, కన్ష్యూషియస్, బుద్ధత్వ వాదాలను మనకు పరిచయం చేసిన ఓషో శైలి నిరుపమానం. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, భైరవతంత్రం, బైబిల్, ఖురాన్, భగవద్గీత – ఇలా అన్నింటికీ తనదైన భాష్యం చెప్పడం అనితరసాధ్యం.
మనిషి కోతి నుంచి పుట్టాడా లేక దేవుడు సృష్టించాడా? అనే పిచ్చి ప్రశ్నకు మనిషిగా పుట్టిన మనిషి వెనక్కి వెళ్ళి కోతిగా తయారవ్వాలా లేక ముందుకెళ్ళి దైవంగా మారాలా? అనేది నిర్ణయించుకోవాలని నిర్ద్వందంగా తీర్పు ఇచ్చిన తీరు అద్భుతం. అలాగే బౌద్ధతత్వాన్ని బుద్ధుడి కంటే స్పష్టంగా అందించిన ఆధునిక బుద్ధుడు ఓషో. ఒక్కొక్కసారి ఆయన కాలంలో వెనక్కివెళ్ళి జరిగినవి చూసివచ్చి మనతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అది ఒక రహస్యం. ప్రతిదీ గతిశీలంగా ఉండాలనే ఓషో రజనీష్ తన ధ్యాన పద్ధతులను కూడా గతిశీలంగానే బోధించాడు. ఇలా జీవిత సత్యాలను, జీవించే కళను చాలా సరళంగా ఆయన బోధించిన తీరు నిరుపమానం. అందుకే నేటికీ ప్రపంచం ఓషోను మర్చిపోలేదు.
ఓషో అంటే సముద్రం అని అర్థం చెప్పుకుంటే సరిగ్గా సరిపోతుంది. విరాట్ స్వరూపాలన్నీ నీలంగా ఉంటాయనుకుంటే ఓషోది కూడా విరాట్ స్వరూపమే. ఈ విశ్వానికి ఈ దేశం అందించిన ఒక విశిష్టమైన, విలక్షణమైన, ఆధ్యాతిక చైతన్య భావజాలపు ఆలోచనాస్రవంతి భగవాన్ ఓషో రజనీష్.
ఓషోను భగవాన్ అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే, ఎవరైనా ఆయన సూచించిన మార్గంలో, ఆయన చెప్పినట్లు ఆలోచనను మలచుకోగలిగితే భగవాన్‌గా మారడం ఖాయం. అయితే ఓషోను అర్థం చేసుకోవాలంటే మన ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన సంభాషణలు, భాష్యాలు, వివరణలను మళ్ళీ, మళ్ళీ విని, చదివితే మన ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. ఓషో ప్రాపంచిక దృక్పధాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి మానసికంగా, ప్రవర్తనా పరంగా, చైతన్యస్థాయి పరంగా కచ్చితంగా ప్రభావితమౌతాడు.
ఎలాంటి సంఘర్షణలకు తావులేని చక్కని మానవాళి మనుగడకు అనుకూలంగా ఈ విశ్వాన్ని మార్చే నవీన మానవుని ఆవిర్భావం కోసం ఆరాటపడిన మహోన్నత వ్యక్తి అయిన ఓషో రజనీష్ 1990 జనవరి 19వ తేదీన పూణే ఆశ్రమంలో పరమపదించారు.
జీవితం ఎక్కడ ముగుస్తుందో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది అంటారు ఓషో. కాబట్టి ఓషో దృష్టిలో మరణం అనేది లేదు. అందుకే ఆయన సమాధిపై … ఓషో జన్మించనూ లేదు, మరణించనూ లేదు. 11-12-1931 నుంచి 19-01-1990 మధ్య కాలంలో ఆయన ఈ లోకాన్ని సందర్శించి వెళ్ళారు. అంతే…… అని ఉంటుంది.