“రెబెల్” అంటే తిరుగుబాటు చేసేవాడు అని అర్థం. కానీ, రెబెల్ అనగానే పొగరుబోతు, విప్లవకారుడు అనే దురభిప్రాయం సమాజంలో పాతుకుపోయింది. దీనికి ముఖ్య కారణం విప్లవానికి, తిరుగుబాటుకు అర్థం సరిగా తెలియకపోవడమే. విప్లవకారుడు చేతిలో ఆయుధంతో హింసాత్మకంగా పోరాడతాడు. కానీ, రెబెల్ తన చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడతాడు.
బలవంతంగా లేదా హింసించడం ద్వారా, దేనికోసమో కాకుండా, దేనినో వ్యతిరేకిస్తూ చేసే వ్యవస్థీకృత పోరాటమే విప్లవం. అది కోపం నుంచి పుడుతుంది. అందుకే అది ఎప్పుడూ హింసాత్మకంగా ఉంటుంది. ప్రేమ, కరుణ, అవగాహన, నిశ్శబ్దాల నుంచే తిరుగుబాటు పుడుతుంది. అందుకే అది చాలా శాంతియుతంగా, అహింసాయుతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది.
రెబెల్ విప్లవకారుడు కాదు. అతడు అమానవీయమైన, అశాస్ర్తీయమైన విధానాలను ఎదిరిస్తూ, దేనికీ తల వంచకుండా, చాలా సృజనాత్మకంగా తిరుగుబాటు చేసే యోధుడు. అతడు ఎప్పుడూ సమాజం చేసే తప్పులను సమాజమే తెలుసుకునేలా చాలా శాంతియుతంగా తిరుగుబాటు చేస్తాడు.
పాత మతాలు, సిద్ధాంతాలతో నిండిన పాత మనసులన్నీ ఏకమై ప్రపంచ ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులను కల్పించాయి. వాటికి వీడ్కోలు పలకడం కేవలం శాంతియుతంగా, ధార్మికపరమైన తిరుగుబాటు చేసే “రెబెల్” వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వాడే ఎంతో అందమైన ఈ భూమిని రక్షించగలిగే అసలైన “నవీన మానవుడు”.
దేనినీ వ్యతిరేకించకుండా దేనికోసమో చేసే పోరాటమే తిరుగుబాటు. అది ఎప్పుడూ చాలా శాంతియుతంగా, అహింసాయుతంగా ఉంటుంది. ఎందుకంటే, అది ప్రేమ నుంచి పుడుతుంది. దేనికోసమో కాకుండా, దేనినో వ్యతిరేకిస్తూ చేసే పోరాటమే విప్లవం. అది ఎప్పుడూ చాలా హింసాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే, అది కోపం నుంచి పుడుతుంది.
కోపం నుంచి పుట్టే విప్లవం ఎప్పటికీ ఉత్తమ సమాజాన్ని నిర్మించలేదు. ఎందుకంటే, అది ఎప్పుడూ మనిషిని మృగంగా మార్చే గుణాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ నుంచి పుట్టే తిరుగుబాటు ఎప్పుడూ ఉత్తమ సమాజాన్నే నిర్మిస్తుంది. ఎందుకంటే, అది ఎప్పుడూ మనిషిని దైవంగా మార్చే గుణాలపై ఆధారపడి ఉంటుంది.
హింస ద్వారా మీరు సమాజాన్ని ఎప్పటికీ మార్చలేరు. ఎందుకంటే, హింస సమాజం మనుగడకు ఆధారం. అందుకే విప్లవాలన్నీ ఎప్పుడూ ఓడిపోయాయి. కాబట్టి, ఏ విప్లవం ఎప్పటికీ విజయాన్ని సాధించే అవకాశం లేదు.
అందరూ విప్లవం చేసేందుకే ముందుకొస్తారు తప్ప, తిరుగుబాటు చేసేందుకు ఎవరూ ప్రయత్నించరు. ఎందుకంటే, తిరుగుబాటు ఒంటరిగా చెయ్యాలి. కానీ, విప్లవానికి అనేక మంది కలవాలి. ఎందుకంటే, ఒక పెద్ద సమాజాన్ని వ్యతిరేకించాలంటే ఒక పెద్ద వ్యవస్థ మీకు అవసరమవుతుంది. అందుకే, తిరుగుబాటు కన్నా విప్లవమే అందరికీ సులభమనిపిస్తుంది.
విప్లవకారుడి విధానాలన్నీ రాజకీయంగా ఉంటాయి. “మనిషిని మార్చేందుకు సమాజాన్ని మార్చితే చాలు” అనే అభిప్రాయంతో విప్లవకారుడు ఉంటాడు. రెబెల్ విధానాలన్నీ ఆధ్యాత్మికంగా ఉంటాయి. “సమాజాన్ని మార్చేందుకు ముందుగా మనిషిని మార్చాలి” అనే అభిప్రాయంతో రెబెల్ ఉంటాడు.
మనిషిని మార్చడంలో ఏ విప్లవము విజయాన్ని సాధించలేదు. అందుకే ఫ్యూడలిజం, కేపిటలిజం, కమ్యూనిజం, సోషలిజం, ఫాసిజం లాంటి విప్లవాలన్నీ పూర్తిగా ఓడిపోయాయి. ఎందుకంటే, విప్లవం ద్వారా అధికారాన్ని సాధించిన విప్లకారులందరూ అధికారం చేతికి రాగానే అవినీతిపరులుగా మారినవారే. మనిషి ఏమాత్రం మారకపోవడమే అందుకు ముఖ్య కారణం.
“సంస్కరణ” అంటే మార్పు. పాతది అలాగే ఉంటుంది. కానీ, దానిని మీరు కొద్దిగా మారుస్తారు. “విప్లవం” సంస్కరణ కన్నా చాలా తీవ్రంగా ఉంటుంది. పాతది అలాగే ఉంటుంది. కానీ, దాని రూపురేఖలన్నీ మారిపోతాయి. “తిరుగుబాటు” సంస్కరణ కాదు, విప్లవం కాదు. అది కేవలం గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడమే.
రెబెల్ ఎప్పుడూ పిరికివాడు కాడు. అతడొక యోధుడు. అతడు మతాలను, సిద్ధాంతాలను, ఆచారాలను, వేదాంత తత్వాలను, సామాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను పరిత్యజిస్తాడే కానీ, సమాజాన్ని పరిత్యజించడు. అతడు తన విధానంలోనే పోరాడుతూ, ఇతర తిరుగుబాటుదారులు అనుసరించేందుకు చక్కని బాట వేస్తాడు.
చర్చిలు, దేవాలయాలు, మసీదులు, సినగాగులు లాంటివన్నీ గతానికి చెందిన వ్యవస్థీకృత మతాల శ్మశానవాటికలే. వాటిని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇప్పటికే అవన్నీ అందరినీ రకరకాలుగా విషపూరితం చేసి, అవిటివాళ్ళుగా మార్చి, చాలా వరకు చంపేశాయి. ఇంతవరకు అవి చేసిన నాశనం లెక్కించలేనిది.
రెబెల్ ఎప్పుడూ పూర్తి ఎరుకతో అద్భుతమైన సమతుల్యస్థితిలో ఉంటాడు. అతడిది కేవలం నూతనత్వం కోసం పరితపించే చర్య మాత్రమే కానీ, పాత వాటికి వ్యతిరేకంగా చేసే ప్రతిచర్య కాదు. అందుకే అతడు ఎప్పుడూ పాత వ్యవస్థ, మృత మానవాళి, కుళ్ళిన సమాజం ఊహలకు అందనంత దూరంలో ఉంటాడు.
రెబెల్ కానివారు మాత్రమే అనుచరులుగా ఉండే మార్గాన్ని అడుగుతారు. ఎందుకంటే, వారి మనస్తత్వం బాధ్యతలను స్వీకరించేందుకు ఇష్టపడదు. అందుకే బాధ్యతలన్నీ గురువులు, నాయకులు, మహానుభావులు, మార్గదర్శకులపై పడతాయి. కేవలం వారిపై నమ్మకముంటే చాలు. ఆ నమ్మకానికి మారుపేరే “ఆధ్యాత్మిక బానిసత్వం”.
రెబెల్ ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛతో కూడిన గాఢమైన ప్రేమలో ఉంటాడు. అందువల్ల అతనికి రక్షకుడు, మార్గదర్శకుడు, దేవుడు, దేవదూతలు ఉండరు. అతడు కేవలం తన సహజత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడే తప్ప ఎవరినీ అనుసరించడు, అనుకరించడు.
మతాలన్నీ సత్యాన్ని బోధిస్తున్నవి కావు. అవి కేవలం మానవాళిని బానిసలుగా చేస్తూ, అందరినీ తమ మందలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పిరికిపందలందరూ ఆ మందలో చేరేందుకు ముందుకొస్తారు. ఎందుకంటే, వారు ఒంటరిగా ఉండేందుకు భయపడతారు.
కేవలం రెబెల్ మాత్రమే అసలైన “ఆధ్యాత్మికవేత్త”. అతడు ఏ మందకు, ఏ విధానానికి, ఏ వ్యవస్థకు, ఏ వేదాంతానికి చెందినవాడు కాదు. అలాగే అతడు తన అంతరంగం లోకి స్వయంగా ప్రవేశించి తన మూలాలను తానే తెలుసుకుంటాడు తప్ప, ఇతరుల నుంచి ఏదీ తెలుసుకోడు.
రెబెల్ అర్థాంగీకారంతో ఉండలేడు. అలాగే అతడు గతం నుంచి దేనినీ ఎంచుకునే వ్యక్తి కాడు. ఏదేమైనా, గతాన్ని పూర్తిగా నిరాకరించవలసిందే. అప్పుడే మనం హింస, క్రూరత్వాలతో పాటు, జీవితం, అస్తిత్వాలను నిరసించే ఆటవిక భావాలతో కూడుకున్న అనాగరిక మానవాళి నుంచి బయటపడతాం.
పోటీ సమాజంలో మీకు స్నేహితులుండరు. అయితే, అందరూ స్నేహితులుగా నటిస్తారు. కానీ, అందరూ మీకు శత్రువులే. ఎందుకంటే, అందరూ అదే నిచ్చెన ఎక్కేందుకు పోట్లాడుకుంటారు. అలా ఒకరి విజయం మరొకరి పరాజయానికి కారణమవుతుంది. అందువల్ల వక్రమార్గంలో ఇతరులను వెనక్కి లాగడాన్ని అందరూ నేర్చుకుంటూ ఉంటారు.