మతాలకు ప్రాతినిధ్యం వహించే మతాచార్యులందరూ మతాలకు మిత్రులు కారు. వారందరూ మతాలకు పరమ శత్రువులు. ఎందుకంటే, మతాలకు మధ్యవర్తుల అవసరం లేదు. మీకు అస్తిత్వానికి మధ్య తక్షణ సంబంధ బాంధవ్యముంది. కాబట్టి, మతాచార్యుల కబంద హస్తాల నుంచి మతం స్వేచ్ఛ పొందనంత వరకు ఈ ప్రపంచం ఎప్పటికీ ధార్మికతను సంతరించుకోదు.

మతాచార్యులందరూ ఇతరులకన్నా ఎక్కువగా మనిషిని మోసం చేస్తున్నారు. వారి వృత్తి ప్రపంచంలో అతి నీచమైన వేశ్యావృత్తికన్నా అత్యంత నీచమైనది. వేశ్య కనీసం ఎంతో కొంత ప్రతిఫలాన్నిస్తుంది. మతాచార్యుడు మీకు కేవలం నిట్టూర్పులను మాత్రమే ఇస్తాడు. అంతకన్నా మీకిచ్చేందుకు అతని దగ్గర వేరే ఏదీ ఉండదు.

సత్యం తెలుసుకున్నవారిని మతాచార్యులందరూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే, ప్రజలు ఆ సత్యాన్ని గుర్తిస్తే మతాచార్యుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి, మతాచార్యులందరూ పరాన్నజీవులే. మనిషి పుట్టినప్పటి నుంచి సమాధికి చేరే వరకు వాడిని దోచుకునేందుకు మతాచార్యులందరూ దారులు వెతుకుతూనే ఉంటారు.

ఎవరిని వారే రక్షించుకోవాలి కానీ, ఎవరూ ఎవరినీ రక్షించలేరు. కానీ, “నేను మాత్రమే రక్షకుడను. నన్ను గుడ్డిగా నమ్మితే, నేను మిమ్మల్ని రక్షిస్తాను” అనేవారందరూ రకరకాల బానిసత్వాలను, కారాగారాలను సృష్టించినవారే. ఈ మతాచార్యులందరూ మరణించిన ఆ రక్షకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి మాటలు గుడ్డిగా నమ్మిన మీరు ఎప్పటికీ రాని ఆ దేవుడి కోసం నిరీక్షిస్తూ మీ జీవితకాలాన్ని వృధా చేసుకుంటారు.

వ్యవస్థీకృత మతాలన్నీ మానవాళి సమైక్యతను నాశనం చేశాయి. వాటికి ప్రాతినిధ్యం వహించే మతాచార్యులందరూ మరీ అమానుషంగా, ప్రతి మనిషి తనను తాను వ్యతిరేకించుకునేలా చేస్తున్నారు. అందుకే ప్రతి మనిషి తనతో తాను యుద్ధం చేస్తూ నేటికీ అనేక బాధలు పడుతున్నాడు. కాబట్టి, వ్యవస్థీకృత మతాలన్నీ అంతరించినప్పుడే మానవాళి అసలైన ధార్మికతను సంతరించుకుంటుంది.

రాజకీయ నాయకులందరూ అబద్ధాలపైన, వాగ్దానాలపైనే జీవిస్తారు. కానీ, వారు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ నెరవేరవు. ఎందుకంటే, వారి దృష్టిలో ప్రజలందరూ వెథవలే. అందుకే ప్రజల ఓట్లను కొని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రజలనే పీడించడం ప్రారంభిస్తారు రాజకీయ నాయకులు. కాబట్టి, రాజకీయ నాయకులను ఎప్పుడూ నమ్మకండి.

చైతన్యానికి సంబంధించినంతవరకు రాజకీయ నాయకులు అత్యథమ స్థాయి వ్యక్తులు. వారు జిత్తులమారి నక్కలే కాక, మరీ సంకుచిత మనస్కులు. మరింత అధికారాన్ని సంపాదించడం కోసం వారు ఎంతకైనా దిగజారతారు. ఎందుకంటే, వారికి అధికారమే పరమావధి.

రాజ్యాధికారం కలిగిన రాజకీయ నాయకులు, ధార్మిక శక్తి కలిగిన మతాచార్యులు ఒకరినొకరు కాపాడుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ, నిరంతరం కుట్రలు చేస్తూ ప్రజలను వాడుకుంటూ, దోచుకుంటూ ఉంటారు. కాబట్టి, వారిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి.

మీకు అసలు నేరస్థులెవరో తెలియాలి. కానీ, సమస్య ఏమిటంటే, ఆ నేరస్థులే గొప్ప నాయకులుగా సమాజంలో చెలామణి అవుతున్నారు. వారే అసలు నేరస్థులు అనే ఆలోచన మీకు ఎప్పుడూ రాదు. నిజానికి, యుద్ధాలు, మారణహోమాలు, హత్యలు లాంటి అనేక సమస్యలకు రాజకీయనాయకులే ముఖ్య కారకులు.

సత్యాన్ని ప్రేమిస్తూ, సత్యాన్వేషణలో ఉంటూ, సత్యాన్ని కనుక్కునే వారందరినీ మతాచార్యులందరూ పరమ శతృవులుగా చూస్తారు. ఎందుకంటే, వారు మతాచార్యుల వ్యాపారాన్ని పాడుచేస్తారు. ఎందుకంటే, మతాచార్యులందరికీ మతం పెద్ద వ్యాపారం.

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com