దేవుడనేవాడు ఉన్నట్లైతే కచ్చితంగా వాడిని మనం చంపేస్తాం. ఎందుకంటే, వాడి ఉనికిని మనం భరించలేం. కానీ, దేవుడనేవాడు లేడు. కాబట్టి, వాడిని ఎవరూ చంపలేరు. కానీ, దురదృష్టం కొద్దీ ప్రజలు కాల్పనిక దేవుణ్ణి సృష్టించారు. అందువల్ల వాడిని మీరు చంపలేరు, వాడితో సంప్రదించలేరు. కాబట్టి, “దేవుడు” అనేది కేవలం ఒక కల్పన.

మీరు వాస్తవాన్ని తెలుసుకోకుండా పోపులు, మతాచార్యులు, శంకరాచార్య పరంపర మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. వారే అసలైన దయ్యాలు. నాకు తెలిసినంత వరకు మానవ మేధస్సును సర్వ నాశనం చేసి, దారుణ మారణకాండకు కారణమైన ఈ సినగాగులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు దయ్యాలకు నిలయాలే కానీ, దేవుడికి కాదు.

“దేవుడు-దయ్యం” అనే భావన మిమ్మల్ని వారికి బానిసగా చేస్తుంది. మీరు జీవంతో ఉట్టిపడాలంటే వారి మరణం మీకు చాలా అవసరం. వారు జీవించి ఉంటే మీరు మరణించినట్లే. ఎందుకంటే, మీరు వారికి బందీ అవుతారు. అందువల్ల మీరు ఒకపక్క దయ్యం కోసం పని చేస్తూనే, దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇద్దరినీ సంతోషపెట్టే నాటకం ఆడుతూనే ఉండాలి.

“దేవుడు” అనేది నిరూపించలేని అనుభవం. అంతేకానీ, దేవుడు ఒక వ్యక్తి కాదు. అలాంటి దేవుడిని మనం రాతితోనో, చెక్కతోనో ఒక విగ్రహంగా తయారుచేసాం. అలా దేవుడిని ఒక వస్తువు స్థాయికి దిగజార్చడమనేది ఆయనను అవమానించినట్లే. ఎందుకంటే, దేవుడు ఒక వస్తువు కాదు, ఒక ఉనికి. కాబట్టి, పూజలన్నీ కేవలం మూర్ఖత్వమే అవుతుంది.

నిజానికి, “దేవుడు” ఒక వ్యక్తి కాదు. అది మనం సృష్టించుకున్న పదం. దేవుడు అంటే నిరంతరం మార్పుకు లోనవుతూ, పరిణామం చెందుతూ, అంచెలంచెలుగా అధిగమిస్తూ ముందుకెళ్ళే ప్రక్రియ. కాబట్టి, నా దృష్టిలో దేవుడు సృష్టికర్త కాదు, సృష్టి ప్రక్రియ.

ఇప్పుడున్న మతాలన్నీ కేవలం కల్పనలు, భ్రమలు, భ్రాంతులతో పాటు, స్వర్గం, నరకం, దేవుడు, దయ్యం, దేవుడు మళ్ళీ అవతారమెత్తడం లాంటి అనేక రకాల చెత్తను మీ బుర్రనిండా నింపుతూ మీ జీవితాన్ని, మీ ప్రేమను, మీ ఆనందాన్ని నాశనం చేస్తూ మీకోసం సమాధులను నిర్మిస్తూనే ఉన్నాయి.

అన్ని మతాలు మీరు నీరసంగా, మృతప్రాయంగా ఉంటూ, ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొచ్చే బుద్ధిహీనులుగా ఉండాలని కోరుకుంటాయి. అయితే “విశ్వాసం” లాంటి మంచి మంచి పేర్లు పెట్టడంలో మతాలు చాలా తెలివిగా ఉంటాయి. విశ్వాసమంటే మీ తెలివితేటలను మీరు ఆత్మహత్య చెయ్యడమే.

ఈ భూమిపై ఉన్న మతాలలో అతి జుగుప్సాకరమైన వ్యవస్థీకృత మతం “క్రైస్తవ మతం”. గడచిన రెండు వేల సంవత్సరాలలో మానవాళికి ఇతర మతాలకన్నా ఎక్కువ హాని చేసిన ఏకైక మతం క్రైస్తవ మతం. అది తన స్వార్థ ప్రయోజనాల కోసం సత్యం, మతం, దేవుడు పేర్లపై ప్రజలను ఊచకోత కోసి, సజీవ దహనం చేసింది. ఈ విషయంలో మహమ్మదీయం క్రైస్తవంతో పోటీపడినా, దానిని అధిగమించలేకపోయింది.

ధర్మ యుద్ధం, ధార్మిక యుద్ధం లాంటి అతి నీచమైన, సిద్ధాంతరహితమైన భావాలు “క్రైస్తవ మతం” మానవాళికి అందించిన మహా ప్రసాదాలు. వాటినే మహమ్మదీయులు జిహాద్ అని, పవిత్ర యుద్ధమని అంటారు. అసలు యుద్ధమే అధార్మికం. అలాంటప్పుడు ధర్మ యుద్ధాలు, జిహాద్ లాంటి పవిత్ర యుద్ధాలు ఎలా ధార్మికమవుతాయి?

జీసస్ మరణించిన 600 సంవత్సరాల తరువాత “మహమ్మదీయం” అనే కొత్త మతాన్ని స్థాపించిన మహమ్మద్ తన జీవితకాలమంతా యుద్ధం, యుద్ధం అంటూ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పోరాడుతూనే ఉన్నాడు. అయితే “శాంతియే నా సందేశం” అని తన కత్తిపై రాసుకున్నాడు. కత్తిపైనా శాంతి సందేశం!

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com