భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. అలా అది మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి, దానిని వదిలించుకోండి. లేకపోతే, అది మీ శక్తిని హరిస్తుంది.
భయం అందరినీ వారి మృత్యువుకన్నా ముందే అనేక వందల, వేలసార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైనది. భయంలో మీరు ఎప్పటికీ ఎదగకపోగా కుంగి, కృశించి, మరణిస్తారు. ఎందుకంటే, భయం ఎప్పుడూ మృత్యువు సేవలో తరిస్తూ ఉంటుంది.
మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమై మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లైతే మృత్యువు నిర్వీర్యమై మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. నిర్జీవ జీవితం మృత్యువుకు శక్తినిస్తుంది, సంపూర్ణ జీవితం మృత్యువును నిర్వీర్యం చేస్తుంది.
మరణ భయమే అన్ని భయాలకు మూలం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మరణ భయమే. ఎందుకంటే, అన్ని భయాలూ మృత్యువుతో ముడిపడినవే. కేవలం ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు. కాబట్టి, కాలాన్ని వృథా చెయ్యకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి.
సహజంగా భయానికి ఎలాంటి శక్తి లేదు. ఎందుకంటే, అది నిర్వీర్యమైనది. మీరు భయాన్ని నమ్ముతున్నారు కాబట్టి, దానిపై మీకున్న నమ్మకమే దానికున్న ఏకైక శక్తి. మీ లోలోపలి లోతుల్లో మునిగి అక్కడి శూన్యాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. మీలోని ఆ బలహీనతే భయానికున్న ఏకైక శక్తి. లేకపోతే, భయానికి ఎలాంటి శక్తి లేదు.
ప్రేమ సృజనాత్మకమైనది. అందుకే అది జన్మనిస్తుంది. కానీ, భయం నిర్వీర్యమైనది, నిస్సారమైనది. అందుకే దాని నుంచి ఇంతవరకు జన్మించినది కానీ, అది సృష్టించినది కానీ ఏదీ లేదు. కానీ, భయానికి ఎలాంటి అస్తిత్వం లేకపోయినా అది మిమ్మల్ని చుట్టుముట్టి మీ శక్తియుక్తులన్నింటినీ హరించి, మీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యగలదు.
జీవితం మీకు అన్నీ ఇవ్వాలనుకుంటుంది. కానీ, అవన్నీ భయం లేని వ్యక్తికే దక్కుతాయి. ఎందుకంటే, భయం లేని వ్యక్తికి ఏదీ అడ్డుపడదు. కాబట్టి, అతనికే ఆ బహుమతులన్నీ దక్కుతాయి. అప్పుడు మీరు ఏమి చేసినా ఒక రకమైన శక్తి, బలం, కచ్చితత్వం, ప్రామాణికతతో కూడిన అద్భుతమైన భావన మీరు కలిగి ఉంటారు.
నిర్భయంగా జీవించడమంటే ప్రేమతో జీవించడమే. అదే పరిణతి చెందిన మార్గం. కాబట్టి, భయపెట్టేవాటిని వదిలించుకోవడమే పరిణతి చెందాలనుకున్న వ్యక్తి ముందుగా చెయ్యవలసిన పని. అప్పుడే మీకు పరిణతి లభిస్తుంది. మీకే తెలియకుండా మీరు మీ పసితనంలోనే భయాన్ని స్వీకరించారు. ఇప్పుడు దానిని చాలా తెలివిగా వదిలించుకుని పరిణతి సాధించండి. అప్పడు మీ జీవితం వెలుగును సంతరించుకుంటుంది.
ప్రేమించేందుకు అహం భయపడుతుంది. ఎందుకంటే, ప్రేమలో జీవితం శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అయితే, దానితోపాటు మరణం కూడా అక్కడికి చేరుకుంటుంది. ఎందుకంటే, జీవన్మరణాలు జంటగా కలిసే ప్రయాణిస్తాయి. కాబట్టి, అహం మరణించినంత మాత్రాన మీరు మరణించినట్లు కాదు. అహం మరణం మీరు ప్రేమతో జీవించేందుకు ఒక చక్కని అవకాశం. ప్రేమలో, ప్రార్థనలో, ధ్యానంలో, విశ్వాసంలో, ఇలా ఎక్కడైతే జీవితం పూర్ణత్వాన్ని పొందుతుందో అక్కడ మరణం ఉంటుంది. మరణం లేని జీవితం పూర్ణత్వాన్ని పొందలేదు.
మరణం అసహ్యమైనది కాదు. అది చాలా అందమైనది. ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు, అణచివేతలకు గురికాకుండా జీవితాన్ని నిర్భయంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా, ఆడుకుంటూ, పాడుకుంటూ, ఆనందంగా పండగ చేసుకుంటూ జీవించినవారికే మరణం చాలా అందంగా ఉంటుంది. జీవితం ఉత్సవమైతే, మరణం అంతకుమించిన అంతిమ వేడుక అవుతుంది.
ప్రేమ అన్నిటినీ ప్రేమిస్తుంది. ఎందుకంటే, దానికి ప్రేమించడమొక్కటే తెలుసు. అందుకే నేను మృత్యువును కూడా ప్రేమించమని అంటాను. అలా చెయ్యగలిగితే మీకు జీవితాన్ని ప్రేమించడం చాలా సులభమవుతుంది. అంతేకానీ, అన్నీ అణచుకుంటూ జీవితానికి వ్యతిరేకంగా మీరు జీవిస్తే మీకోసం సిద్ధంగా ఉన్న చక్కని జీవితాన్ని మీరు కోల్పోతారు.
ప్రతి ఆశ్చర్యాన్ని, ప్రతి అద్భుతాన్ని ప్రశ్న స్థాయికి దిగజార్చే మానసిక ప్రలోభానికి మీలోని భయమే మూలకారణం. అద్భుతమైన జీవితమన్నా, అపురూపమైన అస్తిత్వమన్నా అందరికీ భయమే. అందుకే స్వీయ రక్షణ కోసం కాస్త తెలివిని ఒక రక్షణ కవచంగా మనచుట్టూ మనమే సృష్టించుకుంటాం. కేవలం ధైర్యమున్న సాహసవంతుడు మాత్రమే ప్రతి ఆశ్చర్యాన్ని, ప్రతి అద్భుతాన్ని ఆస్వాదించగలుగుతాడు.
ప్రమాదకరంగానే జీవించాలి. ఎందుకంటే, జీవించేందుకు అదొక్కటే మార్గం. కానీ, మనుషులందరూ భద్రత, వసతి, సౌకర్యాలు కలిగిన సమాధుల వంటి వాటిలో స్థిరపడి సహజ మరణానికి ముందే వారు మరణిస్తున్నారు. కాబట్టి, అజ్ఞాతమైన పిలుపు ఎప్పుడు వినిపించినా దానిని అనుసరించి వెళ్ళాలే తప్ప, ఏదో ఒక చోట ఆగేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. అలా ఆగడమంటే మరణించినట్లే. అది మామూలు మరణం కాదు, అకాల మరణం.
భయం రోగం కాదు. అది కేవలం ఒక లక్షణం మాత్రమే. దానికి చికిత్స లేదు. భయం పోవాలంటే జీవితాన్ని, కాలాన్ని ఏమాత్రం వృథా చెయ్యకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. భయంతో పోరాడేందుకు ఉపయోగించే శక్తినే ఎక్కువగా ప్రేమించేందుకు వినియోగించండి. అలా మీరు భయాన్ని నిర్లక్ష్యం చెయ్యడంవల్ల దాని శక్తి నశించి దానంతటదే అదృశ్యమవుతుంది. కాబట్టి, ప్రేమించడంపై ఎక్కువ శ్రద్ధ వహించండి.